calender_icon.png 16 August, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు పండుగ సభ కాదు.. రైతులకు బెదిరింపు సభ..

30-11-2024 10:55:55 PM

రాష్ట్రంలోని రైతులను బెదిరించేందుకు ఈ సభ పెట్టినట్లుంది

కృష్ణా నీళ్లను అవకాశం ఉన్నా వాడుకోలేక సముద్రం పాలు చేశావు....

పాలమూరు జిల్లాలో తట్టెడు మట్టి ఎత్తింది లేదు...

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి (విజయక్రాంతి): రైతుపండుగ పేరుతో కొడంగల్ లో భూములు ఇవ్వకుండా గిరిజన రైతులు ఎదురు తిరిగినందుకు రాష్ట్రంలోని రైతులను బెదిరించేందుకు పాలమూర్ లో సభ పెట్టినట్లుందని పాలమూరు సభలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగం మీద మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా స్పందించారు.  కొడంగల్ లో భూములు ఇవ్వకున్నా నేను గుంజుకోవడం ఖాయం అని రేవంత్ బహిరంగంగా బెదిరించినట్లుందన్నారు. 

పాలమూర్ బిడ్డ అయితే పాలమూరు మీద ప్రేమ ఉంటే ఏడాది కాలాన్ని ఎందుకు హారతి కర్పూరంలా కరిగించారని, ఏడాదిగా రేవంత్ కు పాలమూరు మీద ధ్యాసనే లేదు.. రేవంత్ జరుపుతున్న సంబరాలు చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారన్నారు. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నిమిష, నిమిషం కృష్ణా నీళ్లను ఒడిసిపట్టి ఉండేవారని అది లేకనే ఈ ఏడాది కృష్ణా నీళ్లను అవకాశం ఉన్నా వాడుకోలేక సముద్రం పాలు చేశావన్నారు. పాలమూరు తపన, పాలమూరు ధ్యాస, పాలమూరు వేదన ఎక్కడా నీలో ప్రజలకు కనిపించలేదని, రేవంత్ సీఎం అయ్యాక ఏడాది పాలనలో పాలమూరు జిల్లాలో తట్టెడు మట్టి ఎత్తింది లేదన్నారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పాలన.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చబడిందని గడిచిన ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలమూరు మళ్లీ వెనకబడిందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావుపెట్టి ఏడాది కావస్తుందని, వట్టెం పంప్ హౌస్ మునిగితే ఇప్పటివరకు ఒక్క మంత్రి ఇటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. నేను పాలమూరు బిడ్డను, నాకు బాధ్యత ఉంది అంటూ రేవంత్ హుంకరించడం హాస్యాస్పదంగా ఉందని, రేవంత్ కు పాలమూరు బాధ తెల్వదు, సీఎంగా బాధ్యత కూడా లేదన్నారు. రైతుపండగ పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని, ఆర్టీసీ బస్సులను మళ్లించి ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా చేశారని కార్తీకమాసం శ్రీశైలం వెళ్లే భక్తులు బస్సులు లేక బస్టాండ్లలో అవస్థలు పెట్టారన్నారు. 

ఇప్పటికైనా రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ 10 శాతం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం సరిగ్గా ఏడాది సమయం కష్టపడితే జిల్లాలో అదనంగా మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ సాక్షిగా రేవంత్ ఒప్పుకున్నాడన్నారు. కాంగ్రెస్ కుట్రలను చేధించి కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పనులను పూర్తి చేశారని మిగిలి పోయిన పనులను పూర్తి చేసి రిజర్వాయర్లను నీటితో నింపాలన్నారు. పాలమూరు సభలో రేవంత్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనిందలా సాగిందన్నారు.