30-11-2024 10:47:46 PM
ధర్నా చౌక్ లో సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల 'ప్రజా దర్బార్-ధర్నా'
రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులను గుర్తించినప్పుడే నిజమైన రైతు పండుగ.
రైతు పండుగలో కౌలు రైతుల మాటేమిటని ప్రశ్నించిన రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు.
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించి, వారికి పథకాలన్నీ అందిస్తామని, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తూ, ఆరు గ్యారంటీలలో కూడా కౌలు రైతులను జోడించిన కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రంలోని ముఖ్య రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాలు సమావేశం నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ తరఫున విస్సా కిరణ్(రైతు స్వరాజ్య వేదిక), టి.సాగర్(తెలంగాణ రైతు సంఘం), ప్రభులింగం (తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల సంఘం), వి.ప్రభాకర్ (ఏఐపీకేఎస్), వెంకటరాములు (తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం), జక్కుల వెంకటయ్య (తెలంగాణ రైతాంగ సమితి), బి.కొండల్ (రైతు స్వరాజ్య వేదిక) పాల్గొని మాట్లాడుతూ.. డిసెంబర్ 4వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తమ డిమాండ్లను వినిపించడానికి వందలాది కౌలు రైతులు ప్రజా దర్బార్, ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కార్యక్రమానికి సంబందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం 2023 సెప్టెంబర్ 13 అప్పటి టిపిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి తెలంగాణ కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖ కాపీలను కూడా మీడియాకి అందించారు. ఆ లేఖలో కౌలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని, 2011లో కాంగ్రెస్ తెచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం తీసుకు వచ్చిందని, ఆ చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మళ్ళీ ఇస్తుందని, రైతు భరోసాతో బాటు ఇతర పథకాలను, పంట రుణాలను కూడా అందిస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. డిసెంబర్ 4న ప్రముఖ పౌరులతో కూడిన జ్యూరీ ముందు వివిధ జిల్లాల నుండి వచ్చిన కౌలు రైతులు తమ సమస్యలను వినిపించిన తర్వాత జ్యూరీ సభ్యులు ప్రభుత్వం ఏమి చేయాలని నిర్దిష్టమైన తీర్పు ఇస్తారని తెలిపారు. రైతు సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్లను రాష్ట్రం ముందు ఉంచుతారని తెలిపారు. శనివారం పాలమూరులో రైతు పండుగ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులను రైతు పండుగలో కౌలు రైతులకు భాగం లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులను గుర్తించినప్పుడే నిజమైన రైతు పండుగ అని అన్నారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలలో 75 శాతం కౌలు రైతులవే అని, కౌలు రైతులను గుర్తించి వారికి పూర్తి మద్దతు అందిస్తేనే రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణను సాధించగలమని వారన్నారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి జిల్లాలలో నిర్వహించిన రైతు సదస్సుల మినిట్స్ ఆర్టీఐ ద్వారా రైతు స్వరాజ్య వేదిక సేకరించిన సమాచారం ప్రకారం ప్రతి సదస్సులోనూ అనేక రైతులు, స్థానిక నాయకులు వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు మద్దతు అందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తూ, కౌలు సాగుదారుల నుండి దరఖాస్తులు తీసుకొని, వారికి ఎల్.ఈ.సీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు, పంట కొనుగోలు కౌలు రైతులందరికీ వర్తింపజేయాలని నాయకులు డిమాండ్ చేశారు.