calender_icon.png 30 September, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మించి.. నిలువునా ముంచి!

30-09-2025 12:05:40 AM

  1. తమది కాని భూమిని అమ్మకానికి పెట్టిన ఘనులు
  2. బాధితుల నుంచి రూ. 45 లక్షలు వసూలు 
  3. రిజిస్ట్రేషన్‌కు రాకపోవడంతో బాధితులకు అనుమానం
  4. నిలదీసే క్రమంలో ఊడాయింపు
  5. గ్రామస్తుల అదుపులో రెండు రోజులుగా మధ్యవర్తి... 

బెల్లంపల్లి, సెప్టెంబర్ 29 : మాయ మాటలతో బురిడీ కొట్టించి భూమి అమ్మకం పేరిట అత్యంత నిరుపేదలను నిలువునా ముంచి వారి నుంచి రూ. 45 లక్షలు దండుకొని ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా ఊడాయిం చిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో ఆదివా రం రాత్రి వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. 

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...  మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ శివారులో 340/1, 341/బీ సర్వే నెంబర్లలో 17.26 ఎకరాల భూమి ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు చెందిన తాతారావు, శ్రీనివాస రావుల పేరిట చలామణిలో ఉంది.

ఈ భూమిని తాము భూ యాజమానుల నుంచి కొనుగోలు చేసినట్లు బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన రామ్ టెంకి హరికృష్ణ (బట్వాన్ పల్లి), రామ్ టెంకి శివ (బట్వాన్ పల్లి), బొలిశెట్టి భీమయ్య (పాత మంచిర్యాల), మొండి (భీమిని, రాంపూర్), లగిశెట్టి సత్యనారాయణ (బుధ కుర్దు)లు ఫేక్ అగ్రిమెంట్ పత్రాలు సృష్టించి వాటితో పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలోని దుబ్బపల్లి గ్రామానికి చెందిన బలాని గంగరాజు, పూజా రి సమ్మయ్య, పూజారి నాగేష్, దాసరి శ్యామ్, దాసరి గోపి, పోల రాములులకు 12 ఎకరా లు అమ్మజూపారు.

సంచార జీవనం సాగి స్తూ రోడ్లపై బుగ్గలు, తల వెంట్రుకలు అమ్ముకుని ఉపాధి పొందుతున్న ఈ ఆరుగురు బాధిత వడ్డెర కుటుంబాల నుంచి కేటుగాళ్లు రూ.45 లక్షలు ముందస్తుగానే వసూలు చేసుకొని ఉడాయించారు. రెండు నెలలుగా కొను గోలు చేసిన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌కు ఈ కేటుగాళ్లు రాకపోవడంతో అను మానించి వచ్చి విచారించి తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. 

ఫేక్ డాక్యుమెంట్లతో డబ్బులు గుంజిన కేటుగాళ్లు...

భూ యాజమానుల నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్లు చూపించి తమ వద్ద నుంచి డబ్బు లను దండుకున్నట్లు బాధితులు వాపోతున్నా రు. ఈ కేటుగాళ్ల ముఠాలో ఒకరైన బొలిశెట్టి భీమయ్య (పాత మంచిర్యాల)ను పట్టుకొని విచారించగా..  తాండూరు మండలం అచ్చులాపూర్ శివారులోని మరొకరి భూమిని చూపి సదరు వ్యక్తులు మరికొంత మంది వ్యక్తుల నుంచి రూ. కోటిన్నరకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది.

దుబ్బపల్లి గ్రామస్తులంతా తరలివచ్చి బాధిత కుటుంబాలకు అండగా బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో రెండు రోజు లుగా  శాంతియుత నిరసన పాటిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని రామ్ టెంకి హరికృష్ణ, రామ్ టెంకి శివ ఇంటి ఎదుట బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

తమ డబ్బులు పూర్తిగా చెల్లించే వర కు గ్రామంలో నిరసన తెలుపుతామన్నారు. పోలీసులు తమకు సహకరించాలని, తమని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించారు. పంది మాంసంతో వంట చేసుకుని వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. మొదటగా రూ. 5 లక్షలు అందిస్తామని మధ్యవర్తు లు చెప్పినప్పటికీ బాధితులు అంగీకరించలేదు.

గతంలోనూ ఇదే తరహా మోసం 

వడ్డెర కులస్తులకు భూమిని అమ్మ జూపి డబ్బులతో ఉడాయించిన బట్వాన్ పల్లికి చెం దిన రామ్ టెంకి హరికృష్ణ, రామ్ టెంకి శివ లు గతంలోనూ ఇదే తరహా మోసానికి తెర తీసి పోలీసులకు చిక్కారు. నకిలీ పత్రాలు సృష్టించి రైతులకు దక్కాల్సిన కౌలు రుణాలను అనర్హులకు కట్టబెట్టారు.

28 మంది కౌలు రైతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి రూ 8.20 లక్షలు స్వాహ చేశారు. 2015-2018లో జరిగిన ఈ వ్యవహారంలో బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన సింగతి భీమయ్య అనే కౌలు రైతు తన పేరిట మరొకరు రుణం పొందారని తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. రైతులకు దక్కాల్సిన కౌలు రుణా లు పక్కదారి పట్టించడంలో కీలకంగా వ్యవహరించిన రామ్ టెంకి హరికృష్ణ,

రామ్ టెంకి శివ, బెల్లంపల్లి అప్పటి ఆంద్రాబ్యాంక్ మేనేజర్ కొండమడుగు మురళీధర్, వీఆర్వో ఎలమద్రి శాంతయ్య, డిప్యూటీ తహసిల్దార్ వరంభట్ల సుధాకర్‌లతోపాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న 11 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు మహిళ వ్యవసాయ అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.