30-09-2025 12:03:42 AM
వలస నేతలకు ప్రాధాన్యమిస్తే సహించేది లేదని అల్టిమేటం
బెల్లంపల్లి, సెప్టెంబర్ 29: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తీరుపై ఆ పార్టీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులుగా కొనసాగి కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన నాయకులకు ప్రాధాన్యమిస్తే సహించబోమని అల్టిమేటం ఇవ్వడం సీనియర్లలో రగులుతున్న అసంతృప్తిని స్పష్టం చేస్తుంది.
కష్ట కాలంలో పార్టీ జెండాను మోస్తూ గడ్డం వినోద్ గెలుపునకు కారణమైన క్యాడర్‌ను స్థానిక అధిష్టానం నిర్లక్ష్యం చేస్తుందన్న అసంతృప్తి వాదనను తెర మీది కి తేవడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నాయకులు కుమిలిపోతున్న విషయం తేటతెల్లమైంది. కొన్ని నెలలుగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను వలస నేతలు అంటిపెట్టుకొని ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పట్ల సీనియర్లు మధనపడుతున్నారు.
బెల్లంపల్లి కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న మత్తమారి సూరిబాబు ప్యానల్ ఏకంగా సమావేశం పెట్టి పార్టీలో నెలకొంటున్న పరిస్థితులను ఏ కరువు పెట్టడంతో బెల్లంపల్లి కాంగ్రెస్‌లోనూ సీనియర్లు, వలస నేతల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కింది.
గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మె ల్యే అభ్యర్థి వినోద్ ఓటమి కోసం పనిచేసిన నేతలను గెలిచిన తర్వాత చేరదీసి అన్ని రకాల ప్రాధాన్యత కల్పిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. నియోజక వర్గంలో రాజకీయ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెగేసి చెబుతున్నారు.
నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ ఎదురుగాలికి నిలబడి ఎమ్మెల్యే వినోద్ గెలు పు కోసం శక్తి వంచన లేకుండా రాజకీయ మంత్రాంగం నడిపిన సీనియర్లతో పాటు మండలాల్లోని సీనియర్లను పక్కనపెట్టి అవమానపరిచే ధోరణిలో వ్యవహరించడం పట్ల సీనియర్లు రగిలిపోతున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని బెల్లం పల్లిలో పనిచేస్తున్న క్రియాశీల క్యాడర్‌లో ఈ వ్యవహారం అసంతృప్తిని రేకెత్తించేదిగా తయారయింది. ఈ విషయంలో స్థానిక అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర చర్చ నడుస్తుంది.