15-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 14 : ఇటీవల హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో పలుచోట్ల నాలాలు, డ్రైనేజీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మన్సూరాబాద్ డివిజన్ లోని ఆర్టీసీ కాలనీలో డ్రైనేజీ 16 సీట్ల లోతుగా కుంగిపోయింది. ఈ మేరకు కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి అధికారులతో కలిసి ఆదివారం ఆర్టీసీ కాలనీలో పర్యటించి, డ్రైనేజీ, మ్యాన్ హోల్ పనులను పరిశీలించారు.
మన్సూరాబాద్ డివిజన్ లోని లెక్చరర్స్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీ, వినాయక నగర్ కాలనీ ఫేస్ -2, ఆర్టీసీ కాలనీ, ఆర్టీసీ ఎక్స్టెన్షన్ కాలనీల్లో మ్యాన్ హోల్స్ ధ్వంసం కావడంతో మురుగు నీరు రోడ్లపై పారుతుంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ ధ్వంసమైనట్లు చెప్పారు. ఆర్టీసీ కాలనీ, సాయిబాబా దేవాలయం, వినాయక్ నగర్ కాలనీ రోడ్లన్నీ మురుగు నీటితో చెరువులను తలపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు.
తక్షణమే డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్డు లో ట్రంక్ లైన్ 16 ఫీట్ల లోతుగా కుంగిపోవడంతో సమస్య ఏర్పడిందని, జలమండలి అధికారులు వెంటనే స్పందించి పనులు వేగవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఐదు కాలనీల్లో డ్రైనేజీ మరమ్మతులు జరుగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జలమండలి అధికారి మేనేజర్ రాజు, రాజేందర్ బాబు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కళ్ళెం శంకర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, రుక్మారెడ్డి, రమణ, గుర్రం బలరెడ్డి, యాదగిరి గౌడ్, పి.ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.