15-09-2025 04:44:53 PM
51 ట్రిలియన్ డాలర్ల మైలురాయి వైపు సాగుతుంది..
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ మెరుగుపడింది..
ఎంజియులో స్నాతక ఉత్సవంలో డిగ్రీ పట్టాలు అందజేసిన రాష్ట్ర గవర్నర్..
నల్గగొండ రూరల్: దేశం బహుళ రంగాల్లో రాణిస్తుందిని, ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించి 51 ట్రిలియన్ డాలర్ల మైలురాయి వైపు సాగుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) అన్నారు. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(Mahatma Gandhi University)లో నిర్వహించిన 4వ స్నాతకోత్సవంలో పాల్గొని మాట్లాడారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ మెరుగుపడిందని 2015లో భారత్ ర్యాంక్ 81వ స్థానంలో ఉండగా నేడు 39వ స్థానానికి మెరుగుపడిందన్నారు. విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని, దార్శనికత, విలువలు శ్రేష్ఠత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలన్నారు. యూనివర్సిటీ మంచి పురోగతిని సాధిస్తుందన్నారు. అనేక అడ్డంకులను అధిగమించి విద్యార్థులను మంచి పౌరులుగా మలుచుతున్నారన్నారు. విద్యారంగం, పరిశోధన, ఆవిష్కరణలు, సేవా కార్యకలాపాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తూ తెలంగాణ అంతటా గ్రామాల నుండి ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తున్నదని అన్నారు.
చాలామంది మొదటి తరం అభ్యాసకులు, వారు సహజమైన ప్రతిబంధకాలతో ఇక్కడికి వచ్చి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అయినప్పటికీ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వారికి ఎదగడానికి ఒక పోషణ వేదికను నిరంతరం అందిస్తున్నదన్నారు. విద్యార్థుల హాజరును బలోపేతం చేయడం, హాస్టల్, క్యాంపస్ సౌకర్యాలను మెరుగుపరచడం, సమ్మిళిత అభ్యాసన వాతావరణాన్ని పెంపొందించడంపై మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం చూపుతున్న దృష్టి లోతైన ప్రశంసలకు అర్హమైనదని, గ్రామీణ యువతను ఉద్ధరించడంలో సమాజంలో అర్థవంతమైన భాగస్వామ్యం కోసం వారిని సిద్ధం చేయడంలో యూనివర్సిటీ పాత్ర నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు. ఒక దశాబ్దానికి పైగా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతి నిర్మాణానికి గణనీయంగా దోహదపడిన గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నదని, విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థగా తీర్చిదిద్దడంలో బలమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లను పెంపొందించి కొనసాగించాలని వారి మద్దతును ఉపయోగించుకోవాలని సూచించారు.
న్యాక్ అక్రెడిటేషన్ గుర్తింపులు యునివర్సిటీకి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా సంస్థ పెరుగుతున్న ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తాయని అన్నారు. దేశ పురోగతి గొప్ప వనరు అని మానవ ప్రతిభ యొక్క స్థిరమైన ఉపయోగంపై ఆధారపడి ఉంటుందని పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణలు దీనికి కీలకమని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సవాలుతో కూడిన సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ప్రపంచ ఆరోగ్య మద్దతులో భారతదేశం సాధించిన విజయాలు మన బలాన్ని ప్రదర్శించాయని, గ్రామీణ ప్రాంతాలతో సహా విశ్వవిద్యాలయాలు యువ మనస్సులను సృజనాత్మకత ఆవిష్కరణలతో పెంపొందిస్తాయి కాబట్టి ఇటువంటి విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. అభివృద్ధి సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే ఈ పెరుగుదల అర్థవంతంగా ఉంటుందని, ఎంజియూ వంటి విశ్వవిద్యాలయాలు సమ్మిళిత వృద్ధికి కీలకంగా మారుతుందన్నారు. ఈ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు విద్యార్థులను కొత్త సాంకేతికతలకు, ముఖ్యంగా పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చేయాలని కోరారు. డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం చెప్పినట్లుగా "కలలు కనండి, కలలు ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయన్నారు. "ప్రతి ఒక్కరు వీటిని పాటించాలని సూచించారు.
హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బిఎస్ మూర్తి(IIT Director BS Murty) మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనలను ప్రోత్సహించాలని ఇంజనీరింగ్ విభాగంలో చేయూతనివ్వాలని అన్నారు. ప్రతి విద్యార్థి చదివే సబ్జెక్టులో డిగ్రీ పోంది తనకు ఇష్టమైన అంశంలో సైతం మరో డిగ్రీ సాధించాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని అన్నారు. ఇంజనీరింగ్ విద్య విద్యార్థులను ఉత్పాదకతవైపు అభివృద్ధి చేయడమే కాకుండా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. నీకోసం మీరు పని చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంజియూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడారు. అంతకుముందు గవర్నర్ 22 మందికి పిహెచ్డీలను, 57 మందికి గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, నారాయణామిత్ లు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏడిసి భవాని ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.