calender_icon.png 15 September, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల వైఫల్యం.. రైతుల ఇక్కట్లు

15-09-2025 04:15:39 PM

టోకెన్లు విసిరేసిండ్రు.. గోదాం వద్ద రైతుల ఆగం.

తులం బంగారం కన్నా యూరియా ఎక్కువైంది.

నానో పై అవగాహన కరువు

రేగొండ (విజయక్రాంతి): రాష్ట్రమంతా యూరియా సమస్యే కానీ రేగొండ మండలం(Regonda Mandal)లో అధికారుల వైఫల్యంతో రైతులు అరిగోస పడ్డారు. పొద్దంత వ్యవసాయ పనులకు పోయి వస్తే రాత్రి నిద్రకు కూడా కరవయ్యారు. మండల కేంద్రానికి సోమవారం యూరియా బస్తాలు వస్తాయనే సమాచారంతో రైతులు ఆదివారం రాత్రి నుండే వ్యవసాయ కేంద్రాల వద్ద జాగారాలు చేస్తూ వేచి చూశారు. మండల కేంద్రానికి వచ్చింది 500 బస్తాలు మాత్రమే అయితే రైతులు వివిధ గ్రామాల నుండి 1000 మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళలు,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక పోలీసులు చొరవ తీసుకుని రైతులను క్యూ లైన్ లో నిల్చోబెట్టేందుకు ప్రయత్నం చేసిన రైతులకు పోలీసులకు మధ్య కొంత గడబిడ నెలకొంది.

యూరియా సరఫరాలో అధికారుల వైఫల్యం.

యూరియాను పంపిణీ చేయడంలో రేగొండ వ్యవసాయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.మండల కేంద్రంలో మన గ్రోమోర్ రైతు సేవా కేంద్రం, పిఎసిఎస్ గోదాం అలాగే దమ్మన్న పేట క్లస్టర్ లో సోమవారం యూరియాను సరఫరా చేశారు.అయితే ఏ ఏ గ్రామాలకు ఎక్కడ యూరియా సరఫరా చేస్తున్నారో అధికారులు ముందుగా రైతులకు తెలుపలేదు.దీంతో రైతులందరూ పిఎసిఎస్ గోదాం వద్ద యూరియా కోసం బారులు తీరారు.దీంతో టోకెన్లు ఇచ్చే క్రమంలో కొందరి రైతులను గ్రోమోర్ రైతు సేవా కేంద్రానికి పంపించారు.కానీ వారి టోకెన్లు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానివి కావడంతో వారికి అక్కడ యూరియా లభించలేదు. దీంతో ఆ రైతులంతా మళ్ళీ పిఎసిఎస్ గోదాం వద్దకు రాగా ఇక్కడ టోకెన్లు అయిపోయాయని వెళ్లగొట్టారు. ఒక్క బస్తా కోసం రాత్రింబవళ్లు నిలిచి ఉంటే మాకు యూరియాను అందజేయకుండా వెళ్లగొట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతులకు విలువలేదు.. టోకెన్లు విసిరేసిండ్రు.

స్థానిక రైతు సురుగూరు కిరణ్ రెడ్డి.

ఈ ప్రభుత్వంలో రైతన్నలకు విలువ లేకుండా పోయింది. అసలు రైతుల గోడే ఎవరికి పట్టదు.ఉదయం 4 గంటలకు వచ్చి ఆధార్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ లతో లైన్లో నిల్చుని టోకెన్లు ఇవ్వమని అధికారులకు ఇస్తే తీసుకున్నట్టే తీసుకొని రోడ్డుపై విసిరేశారు.

తులం బంగారం కన్నా యూరియా ఎక్కువైంది. 

కేతి ఉమ రాజిరెడ్డి, దుంపిల్లపల్లె రైతు.

మాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు పిండి వేయలే. రాత్రి ఒంటిగంటకు వచ్చి లైన్లో నిలుచున్నాము.రెండు బస్తాలు ఇచ్చిర్రు.ఆటో రాకపోవడంతో బస్తాల కావలి ఉన్న. తులం బంగారం కన్నా యూరియా ఎక్కువైంది. ఈ గోస తీరేది ఎన్నడో.

నానో యూరియా పై అవగాహన కరువు. 

సాగులో ఖర్చులు తగ్గించి అధిక దిగుబడి సాధించేందుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కానీ రైతులు పంటలకు వేస్తున్న గుళికల రూపంలో ఉన్న యూరియా వల్ల భూసారం దెబ్బతింటుంది. యూరియా వినియోగాన్ని తగ్గించేలా నానో యురియా (ద్రవ రూపంలో) ను అందుబాటులోకి వచ్చింది. కానీ వీటి వినియోగంపై రైతుల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఆసక్తి చూపడం లేదు.ఎలా వినియోగించాలి.పంటకు ఎంత మేర అందుతుందనే దానిపై అవగాహన కొరవడింది. సాధారణ యూరియాను మాత్రమే చల్లడం తెలుసు. అయితే నానో యురియా ప్రయోజనాలు, వినియోగంపై వివరాలను రైతులకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మండలంలోని సెక్టార్లలో ఎక్కడ రైతులకు నానో యూరియా పై అవగాహన కల్పించిన దాఖలాలు కనిపించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేరుకే వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ సలహాలు,సూచనలు ఇచ్చిన దాఖలాలు మండల కేంద్రంలో ఉన్నాయా అని రైతులు ఎద్దేవా చేస్తున్నారు.