calender_icon.png 20 May, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృత్యు శకటాలుగా ఇసుక లారీలు

20-05-2025 12:00:00 AM

-రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు 

-జాతీయ రహదారులపై భద్రత కరువు 

-ప్రమాద నివారణ చర్యలు శూన్యం 

-తాడ్వాయి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఇసుక లారీ ఇద్దరి మృతి..

-నలుగురి పరిస్థితి విషమం 

మహబూబాబాద్, మే 19 (విజయ క్రాంతి): ఇసుక లారీలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. జాతీయ రహదారులపై డ్రైవర్ల మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కారణంగా ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఆదివారం రాత్రి ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలో మేడారం వెళ్లి వస్తున్న భక్తులతో ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరికొంతమంది స్వల్ప గాయాలకు గురై ప్రాణాలతో బయటపడ్డారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతం నుండి నిత్యం వందలాది లారీలను ఇసుక రవాణాకు వినియోగిస్తున్నారు. ఇందులో ఎక్కువగా డ్రైవర్లు మితిమీరిన వేగం, నిర్లక్ష్యంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ఉన్న జాతీయ రహదారులతో పాటు ఇతర రహదారులపై ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇసుక రవాణా కు వినియోగిస్తున్న ప్రధాన రహదారులకు సమీపంలోనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు ఉండడంతో ఇతర వాహనాల రాకపోకల సంఖ్య అధికంగా ఉంటోంది.

ఈ క్రమంలో ఇసుక లారీల బారిన పడి అనేకమంది మృత్యుపాలవుతున్నారు. ఇసుక లారీల వల్ల ప్రమాద ఘటనలు చోటు చేసుకుని ఇటీవల అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మల్లంపల్లి మండల కేంద్రం సమీపంలో గత ఫిబ్రవరి నెలలో ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బుధరావుపేటకు చెందిన షేక్ మహబూబ్ షేక్ ఫైనా దంపతులు దుర్మరణం పాలయ్యారు.

అలాగే ఎటునాగారం వద్ద కంటైనర్ ఆటోను ఢీ కొట్టిన ఘటనలో వాజేడుకు చెందిన ఐదుగురు మరణించారు. ఇక వెంకటాపురం మండలం రామంజపురం సమీపంలో రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీకొనగా ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే వాజేడు మండలంలో ఆర్టీసీ బస్సులు ఇసుక లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

వెంకటాపురం మండలం 37 వీరాపురం గ్రామంలో ఇసుక లారీ ఢీ కొట్టి ఓ వ్యక్తిని 100 మీటర్లు ఇడ్చుకెళ్ళింది. దీనితో అతని దేహం చింద్రమైంది. అలాగే జాతీయ రహదారులపై అనేకచోట్ల మూలమలుపులను సరి చేయకపోవడం వల్ల ప్రమాద ఘటనలకు కారణంగా మారుతున్నాయి. హనుమకొండ నుండి భూపాలపట్నం, మల్లంపల్లి నుండి నకిరేకల్ , వెంకటాపురం నుండి ఏటూర్ నాగారం, మంగపేట, తిమ్మంపేట వరకు జాతీయ రహదారిపై నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

అనేక చోట్ల రోడ్లపై ప్రమాదకరమైన మలుపులు ఉన్నప్పటికీ వాటిని సరి చేయకుండా వదిలేయడంతో రాత్రిపూట ప్రమాదాలకు హేతువుగా మారుతున్నాయి. దీనికి తోడు కొన్నిచోట్ల నిత్యం ప్రమాదాలు జరుగుతుండగా ‘డేంజర్ స్పాట్ ’ గా గుర్తించినప్పటికీ అక్కడ రోడ్లను విస్తరించక పోవడంతో ప్రమాదాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదంటున్నారు. 

జాతీయ రహదారిపై నూగూరు, మంగపేట, తిమ్మంపేట క్రాస్, వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్, ఏటూరు నాగారం, చిన్న బోయినపల్లి, గోవిందరావుపేట మండలం సోమలగడ్డ క్రాస్ రోడ్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో ఘట్టమ్మ దేవాలయం, ఎర్రిగట్టమ్మ మూలమలుపు వద్ద తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న చోట ప్రమాద కారణాలను గుర్తించకపోవడం, మలుపులు, ప్రమాదకర స్థలాల్లో అవసరమైన ముందస్తు హెచ్చరికలను సూచించే విధంగా తగిన చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రమాద ఘటనలకు కారణంగా మారుతున్నాయి.