calender_icon.png 17 January, 2026 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తత గ్రామంగా సండ్రలబోడు

17-01-2026 03:30:23 AM

అశ్వాపురం, జనవరి 16 ,(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోనే సర్పంచ్తో పాటు పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సండ్రలబోడు గ్రామ పంచాయతీని దత్తత గ్రామంగా తీసుకొని, గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సండ్రలబోడులో సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుధ్య మెరుగుదలతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గ్రామంలో ఐక్యతకు నిదర్శనమని, ఇలాంటి గ్రామాలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందుతుందని అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ,సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పనిచేస్తే సండ్రలబోడు ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కరించి, అభివృద్ధిలో ముందుండేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.