17-01-2026 03:29:16 AM
జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, జనవరి 16 (విజయ క్రాంతి): రేపు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంత్రి, శుక్రవారం మద్దులపల్లి నర్సింగ్ కళాశాల వద్ద జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి రేపు జరుగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రేపు ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య సీఎం రేవంత్ రెడ్డి మద్దులపల్లిలో ల్యాండ్ అవుతారని అన్నారు. హెలీ ప్యాడ్ నుంచి పైలాన్ వరకు నడక మార్గంలో సీఎం వస్తారని అక్కడ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని అన్నారు. పైలాన్ వద్ద అవసరమైన అలంకరణ పనులు పూర్తి చేయాలని అన్నారు.
జెఎన్టియు కళాశాల భవన నిర్మాణానికి, మున్నేరు నుండి పాలేరు లింక్ కెనాల్ కు శంకుస్థాపనలు, నూతన యార్డు, కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరణ,ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్ శనివారం వరకు సిద్దం అవుతుందని అన్నారు.
పైలాన్ వద్ద భూమి పూజ నిర్వహించి సభ ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. హెలీ ప్యాడ్ వద్ద వివిఐపీలు, మంత్రుల, సీఎం కాన్వాయ్ వాహనాలు మాత్రమే అనుమతించడం జరుగుతుందని మిగిలిన ప్రజాప్రతినిధుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం సభ వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపి సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.