calender_icon.png 22 November, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోనపాడు గ్రామంలో చీరలు పంపిణీ కార్యక్రమం

22-11-2025 09:37:26 PM

గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు, సామాజిక శ్రేయస్సు కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో, ధరూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శనివారం పండుగ వాతావరణం లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలన్న ఇబ్బంది పడే వారిని, గత 15, 20 సంవత్సరాలుగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటై ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆడపడుచులు ఆర్థికంగా  ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ రుణాలతో పిండి గిర్నీల ఏర్పాటు, ఆహార ఉత్పత్తుల తయారీ, ట్రాక్టర్స్, వరి కోత యంత్రాలు కొనుగోలు చేసి అద్దెకివ్వడం, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారన్నారు. గోనుపాడు గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు కానుందని, మహిళా సంఘాల సభ్యులు దీని నిర్వహణతో నెలకు సుమారు రూ.3 లక్షల  ఆదాయాన్ని అర్జించవచ్చు అన్నారు.

మహిళా సంఘాల ద్వారా బస్సులు నడిపేందుకు వీలుగా, వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం  పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుందని, ఫలితంగా మహిళలు బస్సుల యజమానులుగా మారుతున్నారని, పెట్రోల్ బంకుల నిర్వహణ తో కూడా లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నారు.  మహిళలు వివిధ వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేలా గద్వాలలో త్వరలోనే మహిళ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారికి ఉచిత బస్సు ప్రయాణ అమలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ వివిధ సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరలను ధరించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకే కాక తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు కూడా ఈ చీరలను అందజేయడం జరుగుతుందన్నారు. 

ఆయా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు... జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తుండడంతో  ఆయా గ్రూపులకు బ్యాంకుల ద్వారా రూ. 20 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తుండడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. ఈ రుణాలతో ఆయా సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడం సంతోషకరమన్నారు. జిల్లాలో గట్టు, మల్దకల్, అలంపూర్ మండలాల్లోనీ సంఘాలకు బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.30 లక్షల చొప్పున సబ్సిడీ మంజూరు చేసిందని, ఆయా సంఘాలు కేవలం రూ.6 లక్షలు చెల్లిస్తే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపిస్తే, వాటి అద్దెల రూపంలోనూ సంపాదించే అవకాశం ఏర్పడిందన్నారు.

మునుముందు జిల్లాలోని మిగతా మండలాల్లోని సంఘాలకు కూడా బస్సులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించి, మహిళలను బస్సులకు యజమానులను చేయడం జరుగుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు  మహిళా సంఘాలకు అప్పగించడంతో అక్కడ కూడా వారు సంపాదించుకునే అవకాశం కలిగిందన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం, గ్యాస్ సబ్సిడీ చెల్లిస్తుండడం, ఉచిత బస్సు సౌకర్యం వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో జిల్లాలో వీటి నిర్మాణం వేగవంతం చేసినట్లు చెప్పారు. ర్యాలంపాడు వంటి ముంపు గ్రామాల్లో అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక్క గుడిసెలేని గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం పేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తోందన్నారు. కొద్ది రోజుల కిందట గోనుపాడు గ్రామంలో మృతి చెందిన ఒక మహిళా సంఘ సభ్యురాలి అంత్యక్రియల నిమిత్తం గ్రామంలోని అన్ని సంఘాల సభ్యులు కలిసి రూ. 36 వేలు జమ చేసి వారి కుటుంబానికి అందజేయడం అభినందనీయమన్నారు.

మహిళా సంఘాలతో ప్రతి ఒక్కరిలో సత్సబంధాలు ఏర్పడడమే కాక, కలిసికట్టుగా ఉండేందుకు ఈ సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు. ప్రభుత్వం మరణించిన మహిళ సంఘాల సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించేందుకు రూ. లక్ష బీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 80,000 మందికి పైగా మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వీరితోపాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 ఏళ్లు నిండిన ఆడపడుచులు అందరికీ ఇందిరమ్మ చీరలను ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో లేని ఇతర ఆడబిడ్డలను కూడా సంఘాల్లో చేరేలా ప్రోత్సహించాలని, ఫలితంగా కుటుంబ నిర్వహణలో మహిళలు కీలక శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.

మహిళలను ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని, ఫలితంగా వారి కుటుంబ అభివృద్ధితోపాటు దేశ ప్రగతిలో ముఖ్య భూమిక వహిస్తారనడంలో అతిశయోక్తి లేదన్నారు. ధరూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న గ్రామ మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జిల్లాలో గ్రామ మహిళా సమాఖ్య భవనాలు లేని మిగతా గ్రామాల్లో కూడా భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ పలువురు మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు.