22-11-2025 09:36:15 PM
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని అదుర్తి సూర్యకుమారి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చితలూరి సుధాకర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. పైనారో పైరజోల్స్, ట్రయాజోల్ పొందుపరచిన బెంజోక్సాజోల్ ఆక్సాజోల్ ఉత్పన్నాల రూపకల్పన, సంశ్లేషణ, లక్షణం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. తేలికపాటి పరిస్థితులలో పునర్వినియోగించదగిన పాలీస్టైరిన్ పారాటోలుయెన్ సల్ఫోనిక్ యాసిడ్ ఉత్ప్రేరకాన్ని ఉపయోగించి పైరానో, స్పిరో పైరజోల్ ల కోసం సమర్థవంతమైన సింథటిక్ పద్ధతులను అభివృద్ధి చేయడంపై ఆమె దృష్టి పెట్టినట్టు వివరించారు.
ఈ వినూత్న పర్యావరణ అనుకూల రసాయన(గ్రీన్ కెమిస్ట్రీ) విధానం సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వేగవంతమైన ప్రతిచర్యలు, అధిక దిగుబడి, పర్యావరణ స్థిరత్వాన్ని అందిస్తుందన్నారు. డాక్టర్ సూర్యకుమారి పరిశోధన యొక్క తరువాతి దశలో, ఆమె క్లిక్ కెమిస్ట్రీని ఉపయోగించి నూతన ట్రయాజోల్ ఆధారిత బెంజోక్సాజోల్, ఆక్సాజోల్ ఉత్పన్నాల శ్రేణిని రూపొందించి సంశ్లేషణ చేసి, వాటి క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని అంచనా వేసినట్టు వివరించారు. అనేక సమ్మేళనాలు మానవ క్యాన్సర్ కణ తంతువులకు వ్యతిరేకంగా గణనీయమైన కార్యాచరణను ప్రదర్శించాయన్నారు.
ఇది కొత్త క్యాన్సర్ నిరోధక ఏజెంట్ల అభివృద్ధికి ఆశాజనకమైన పరిధిని సూచిస్తోందని తెలిపారు. ఆమె పరిశోధనలు గ్రీన్ కెమిస్ట్రీ, ఔషధ కెమిస్ట్రీ.. రెండింటికీ గణనీయంగా దోహదపడతాయని అభిలషిస్తున్నారు. డాక్టర్ సూర్యకుమారి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.