calender_icon.png 6 December, 2024 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు

10-10-2024 08:29:41 PM

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య

ముషీరాబాద్,(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అవసరం లేదని ఎస్సీలలో ఎక్కువమంది లబ్ధి పొందింది మాదిగ కులస్తులేనని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య అన్నారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కో-చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, బేర బాలకిషన్, గోపోజు రమేష్, బత్తుల రాంప్రసాద్ లతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలన్నారు. అసలు వర్గీకరణ అంశం తెలంగాణకు వర్తించదని విషయాన్ని గుర్తించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ దళితుల స్థితిగతులను అధ్యయనానికి ఉమ్మడి ఏపీ జనాభా లెక్కలు తీసుకుంటామని సీఎం చెప్పడాన్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందని చెన్నయ్య పేర్కొన్నారు.

2014 నుండి తెలంగాణలో దళితుల స్థితిగతులను అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఎస్సీల అభివృద్ధికి ఏలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల మంత్రి లేని ఉత్తం కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలని కోరారు. వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానమా? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో నోరు విప్పని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన పదవికి రాజీనామా చేయాలన్నారు. గురుకుల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసిన కాలంలో జరిగిన విద్యా, ఉద్యోగ పదోన్నతులు, కాంట్రాక్టులపై సీబీఐ విచారణ చేయాలని చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచాల లింగస్వామి, జంగా శ్రీనివాస్, కరణం కిషన్, గుడిమల్ల వినోద్ కుమార్, మన్నె శ్రీరంగా, తాలూకా అనిల్ పాల్గొన్నారు.