06-11-2025 01:00:52 AM
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం క్రితం కర్నూల్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లా చేవేళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది విగతజీవులుగా మారడం బాధాకరం.
కర్నూల్ బస్సు ఘటనలో 25 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో టిప్పర్ కంకర ఓవర్ లోడింగ్‌తో వెళ్లడమే గాక డ్రైవర్ వాహనాన్ని అధిక వే గంతో నడిపినట్లు నిర్ధారణ అయింది. తరచూ బస్సు ప్రమాదాలు ఉలిక్కి పాటుకు గురి చేస్తున్నాయి. ఏవైపు మృత్యువు ముంచుకొస్తుందో అని ప్రయాణికులు భయపడుతున్నారు. గతం లో ఇదే బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగి 300 మంది దాకా మరణించినట్లు పలు నివేదికలు పేర్కొనడం గమనార్హం.
పేరుకు జాతీయ రహదారి అయినప్పటికీ రోడ్డు మొత్తం అతుకుల గుంతలా తయారైందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరిగి మృత్యు రహదారిగా మారిపోయింది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో కలిసి జాతీయ రహదారిపై ఉన్న గుంతలను పూడ్చడంతో పాటు రహదారి అభివృద్ధికై కేంద్రం వద్ద నిధులు తేవాలని కోరుతున్నారు. వరుస బస్సు ప్రమాద ఘటనలతో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకే జంకుతున్నారు.
సతీశ్ రెడ్డి, హైదరాబాద్
కరెంటు సమస్య తీరెదెన్నడూ?
అభివృద్ధి పరంగా వనపర్తి జిల్లా విస్తరించించినప్పటికీ కరెంటు కోతలు సమస్యగా మారిపోయింది. మందుస్తు సమాచారం లేకుండా పదే పదే కరెంటు కట్ చేస్తున్నారు. సమస్య పరి ష్కరించాలని స్థానిక కాంగ్రెస్ నేతల వద్దకు వెళితే పట్టించుకోవడం లేదు. ఈ సమస్య ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వనపర్తి టౌన్ ప్రజలు చైతన్య పరులు. ఇతర ప్రాంతాల నుంచి వనపర్తికి వచ్చిన జిల్లా అధికారులు గమనించి పనిచేయాలి.
ఎవరూ వారికి భయపడరన్న విషయం గుర్తుంచుకోవాలి. సీసీఏ నిబంధనలు కింది స్థాయికి కూడా వర్తిస్తుంది. గతంలో చిన్నారెడ్డి మంత్రి హోదాలో ఉన్నప్పుడు వనపర్తిలో తాగునీటి సమస్య ఏర్పడింది. అయితే అప్పుడు రామన్‌పాడు రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ నీటి కొరత ఉండడం ఆశ్చర్యం కలిగించింది. కానీ మున్సి పల్ అధికారులు మాత్రం తాగునీరు సరఫరా చేయడంలో విఫలమయ్యారు.
అధికారులు తప్పులు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కని పిస్తున్నా నాయకులు పట్టించుకోకపోవడంతో వారికి ఎన్నికల్లోనే బుద్ధి చెబుతూ వస్తున్నాం. ఇప్పటికైనా వనపర్తిలో కరెంటు సమస్యపై ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్‌కు అందిన ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
బాలకృష్ణ, వనపర్తి