06-11-2025 01:03:07 AM
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) రెండో దశ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. సర్ రెండో దశ జాబితాలో ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి.
మొత్తం 321 జిల్లాలు, 1843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ‘సర్’ను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన చేపట్టడంతో రెండో దశ ప్రక్రియ సజావుగా సాగుతుందా అన్నది అనుమానమే.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ ప్రక్రియ బెంగాలీ మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ‘నిశ్శబ్ద రిగ్గింగ్’గా ఆరోపించారు.
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా మంగళవారం కోల్‌కతా వీధుల్లో భారీ ర్యాలీని మమత ముందుండి నడిపించడం గమనార్హం. వాస్తవానికి బెంగాల్‌లో 2022లోనే ఓటర్ రివిజన్ జరిగిందని, ఇంత హడావిడిగా సర్ ప్రక్రియను ఈసీ ఎందుకు నిర్వహిస్తుందో అర్థం కావడం లేదన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మరోవైపు కేరళలో అధికారంలో ఉన్న పినరయి విజయన్ సర్కారు కూడా ‘సర్’ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందన్నారు.‘సర్’ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ సుప్రీంకోర్టును ఇప్పటికే ఆశ్రయించింది. ఈసీ నిర్వహించతలపెట్టిన ‘సర్’ ప్రక్రియపై విపక్ష రాష్ట్రాల్లో ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం బీహార్‌లో భారీగా ఓట్లు గల్లంతవ్వడమే. తొలి దశలో బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా వివిధ కారణాలు చెప్పిన ఈసీ దాదాపు 51 లక్షల మంది ఓట్లను తొలగించింది.
సొంత రాష్ట్రంలో పుట్టి బతుకు జీవనం కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిన వాళ్ల ఓట్లు ఇక్కడే ఉన్నప్పటికీ వారు స్థానికులు కాదనే కారణంతో విచ్చలవిడిగా ఓట్లు తొలగించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దొంగ అడ్రస్‌లు, తప్పుడు ఫోటోలు, నకిలీ ఓట్లపై చర్య తీసుకో వడం సమర్థనీయమైనప్పటికీ పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాలకు వలసవెళ్లిన వారిని దొంగ ఓట్లుగా పరిగణించడం దారుణమని ఆరోపించాయి.
బీహార్‌లో జరిగిన సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిం చడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని.. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగబోతున్నందున ఇంత హడావిడిగా సర్ ప్రక్రియను ఎందుకు చేస్తుందో ఈసీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందంటూ ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించడం ‘సర్’ ప్రక్రియపై అనుమానాలు మరింత బలపడేలా చేశాయి. కానీ విపక్షాల ఆరోపణలు పట్టించుకోని ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోతుంది. పారదర్శకంగా సర్ ప్రక్రియను నిర్వహించి నకిలీ ఓట్లను తొలగించడమే లక్ష్యమని ఈసీ మరోసారి స్పష్టం చేసింది.