24-07-2025 12:46:08 AM
కలెక్టర్ తనిఖీలో బయటపడ్డ వ్యవహారం
చేర్యాల, జూలై 23: విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం వివిధ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలను ఉట్టి చేతులతో ఇంటికి పంపి, వారు మాత్రం పాఠశాలలో బగారా రైస్, చికెన్ వండుకొని దావత్ చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
అప్పటివరకు అన్ని అనుకున్నట్టుగానే జరుగుతుండగా, విందు భోజనం ఆరేగించే సమయానికి కలెక్టర్ హైమావతి పాఠశాలకు తనిఖీ చేయడానికి వచ్చారు. పాఠశాలను తనిఖీ చేస్తున్న సమయంలో విద్యార్థుల విషయాన్ని అడగగా బందు కావడంతో ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. వంటగది పరిశీలించగా బగారా రైస్, చికెన్ వండి పెట్టినట్లు గమనించి ఎవరికి వండి పెట్టారని ప్రశ్నించారు.
సరైన సమాధానం చెప్పలేక పంతుళ్లు నీళ్లు నమిలారు. వండిన ఆహార పదార్థాలను హాస్టల్ విద్యార్థులకు పంపించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనాన్ని వారికి పెట్టకుండా ఉపాధ్యాయులు రుచికరంగా వండుకొని తినడానికి ప్రయత్నించిన ఘటన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.