calender_icon.png 25 November, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో సృజనాత్మకతకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం

25-11-2025 12:54:47 AM

-జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెల్లడి 

-పాల్గొన్న కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, నవంబర్ 24 (విజయ క్రాంతి): విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభు త్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్, ఇన్ స్పురై ప్రదర్శనను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి సైన్స్ ఫేర్‌లో విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. సుస్థిర అభివృద్ధి,  లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజ నాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన  విద్యార్థిని, విద్యార్థులను అభినం దించారు. 

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, సృజనాత్మకత పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలల నుండి సైన్స్ ఫేర్, ఇన్ స్పురై కార్యక్రమాలలో విద్యార్థుల భాగస్వామ్యం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణతో పాటు, ఈ ప్రదర్శనలలో పాల్గొనే విద్యార్థులకు కూడా జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి ఇన్ స్పురై కు ఎంపికైన 119 మంది విద్యార్థులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహక రూపంలో రూ. పది వేలు చొప్పున నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని అన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. భగవద్గీత గ్రంథాన్ని మూడు నెలల వ్యవధిలో ఉర్దూలో అనువదించిన బోధన్ పట్టణానికి చెందిన ముస్లిం యువతి ఫాతిమాను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఈఓ అశోక్, సైన్స్ ఫేర్ అధికారి గంగా కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.