calender_icon.png 25 November, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన శాస్త్రం నిరంతర ప్రక్రియ

25-11-2025 04:32:53 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విజ్ఞాన శాస్త్రం అనేది ఒక నిరంతర ప్రక్రియని ఒక రోజుతో పూర్తిగా తెలుసుకోలేమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఇన్చార్జి డిఈఓ దీపక్ తివారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్ స్పైర్ మనాక్ కు చైర్మన్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరై సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక రోజుతో అర్థమయ్యేది కాదన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో అపజయం అనేది వస్తుందని దాని నుండి పాఠాలు నేర్చుకుని చేసిన తప్పులను సరిదిద్దుకొని విజయం వైపు నడవాలన్నారు.

సైన్స్ దీనిని ఎప్పుడు నేర్పుతుందని చరిత్రలో ఎంతోమంది శాస్త్రజ్ఞులు తమ ప్రయోగాలలో ఒకేసారి విజయవంతమైన వారు ఎవరు లేరన్నారు. న్యూటన్, ఐన్ స్టీన్ లాంటివాళ్ళు కూడా అనేక ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. విద్యార్థులు చిన్ననాటి నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని అప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు. సైన్స్ ఫెయిర్ నిర్వహణ ఎంతో బాగుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా బస్సు ద్వారా ఏర్పాటు చేసిన సైన్స్ లాబరేటరీ సందర్శించి కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు. శోధించి సాధించాలి తప్ప సులభంగా వచ్చేదానిని ఎంచుకోవద్దన్నారు.

అంతకుముందు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని రమాదేవి మాట్లాడుతూ విద్యార్థుల యొక్క హావభావాలు క్రమశిక్షణ చూడడానికి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థులను నైపుణ్యవంతంగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించడంతోపాటు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుని పలు ప్రశ్నలను సంధించారు. తెలియని ప్రశ్నలను తెలుసుకోవాలని వారికి సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 300 ప్రదర్శనలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ దేవాజి, సమన్వయకర్త మధుకర్, సభ్యులు శ్రీదేవి, రాందాస్, ప్రభాకర్, ఆర్గనైజింగ్ సభ్యులు హనుమంతు, సుభాష్ పాల్గొన్నారు.