27-11-2025 12:00:00 AM
ఫిషరీష్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ఫిషరీష్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెండవ ఫిష్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. మొదటి క్యాంటీన్ మత్స్యశాఖ ప్రధాన కార్యాలయం మాసబ్ ట్యాంక్‌లో ఉండగా, బుధవారం నాంపల్లి గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద రెండవ ఫిష్ క్యాంటీన్‌ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రారంభించారు. అనంతరం మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ..
ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేపల విక్రయాన్ని విరివిగా చేపట్టాలని నిర్ణయించిన దృష్ట్యా ఈ ఫిష్ క్యాంటీన్లను నగరంలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘నేను కొన్ని ఫిష్ ఐటమ్స్ టెస్ట్ చేశాను చాలా రుచిగా ఉన్నవి ప్రతిరోజు ఇదే విధమైన రుచితో ప్రజల కు అందిస్తే మంచి ఆదరణ లభిస్తుంది’ అన్నారు.
ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పలువురు డాక్టర్ల సలహాల మేరకు వారానికి ఒక్కసారైనా తప్పనిసరిగా ఫిష్ తీసుకోవాలని సూచనల మేరకు ఫిష్ వాడకాన్ని ప్రజల వద్దకు విరివిగా తీసుకురావాలనే సంకల్పంతో మా ప్రభుత్వ ప్రయత్నం ఫిష్ క్యాంటీన్ల రూపంలో అమలు చేస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశమని, క్యాంటీన్ పెట్టుకోవాలనుకునే యువత ముందుకు రావాలని, వారికి తమ శాఖ తరఫున సహాయ సహకారలు అందజేస్తామని తెలిపారు.