calender_icon.png 13 January, 2026 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగోడికి ఛాన్స్

13-01-2026 12:00:00 AM

న్యూజిలాండ్‌తో రెండో వన్డే

అర్షదీప్‌కు అవకాశమిస్తారా?

న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. జట్టులో రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమవగా.. తుది జట్టులోకి తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుంది. అలాగే పేస్ విభాగంలో ప్రసిద్ధ కృష్ణ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అర్షదీప్ సింగ్‌ను ఫైనల్ ఎలెవన్ లోకి తీసుకుంటారని భావిస్తున్నారు.

రాజ్ కోట్, జనవరి 12 : భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఇప్పుడు రాజ్ కోట్‌కు షిప్ట్ అయింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో గెలిచి టీమిండియా 1--0 ఆధిక్యంలో నిలిచింది. బౌలింగ్‌లో అనుకున్నంతగా రాణంచకున్నా.. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, గిల్, శ్రేయాస్ తో పాటు హర్షిత్ రాణా మెరుపులు భారత్‌కు విజయాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో సిరీస్ విజయమే లక్ష్యంగా రెండో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. రెండో వన్డే కోసం భారత తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తొలి వన్డే ఆడుతూ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. రీప్లేస్ మెంట్‌గా బదోనిని ఎంపిక చేసినా పేస్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తాడు. నితీశ్‌కు ఇది మంచి అవకాశంగా చెప్పాలి. గతంలో పలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఈ తెలుగు క్రికెటర్ విఫలమయ్యాడు.

మరి వన్డే జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే ఇంతకుమించిన మంచి ఛాన్స్ రాదని చెప్పొచ్చు. బౌలర్లు అంచనాలు అందుకోకపోవడంతో తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. తొలి వన్డేలో బౌలర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దీంతో అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషనలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా గిల్, రోహిత్ శర్మ కొనసాగనున్నారు. తొలివన్డేలో గిల్ హాఫ్ సెంచరీతో రాణించినా.. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లలో 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. అతని అవసరం జట్టుకు ఎంత ఉందో తొలి వన్డేతోనే అర్థమైపోయింది.  తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటకీ క్లాసిక్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు.  

అలాగే  గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఆకట్టుకున్నాడు. ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చురున్న అయ్యర్ మరో కీలక ఇన్నింగ్స్ ఆడితే భారీస్కోరు ఖాయం. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా తీవ్రంగా నిరాశపర్చాడు. అతను రెండో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది. పేస్ బౌలింగ్‌లో సిరాజ్ కూడా పర్వాలేదనిపించాడు. కానీ కొత్త బంతితో అతను మరింత ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. బుమ్రా లేని ఈ అవకాశాన్ని సిరాజ్ ఒడిసిపట్టుకుంటే తిరుగుండదు. అటు స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. తన మార్క్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఓవరాల్‌గా అర్షదీప్ సింగ్ రీఎంట్రీతో టీమ్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. 

రెండో వన్డేకు భారత తుది జట్టు (అంచనా)

శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షీదీప్ సింగ్/ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.