calender_icon.png 27 September, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్వాన్స్ టెక్నాలజీతో భవిష్యత్తుకు భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

27-09-2025 06:12:51 PM

కల్వకుర్తి: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో విద్యనభ్యసించిన విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి ఐటి కళాశాల ప్రాంగణంలో రూ.44 కోట్ల తొ నిర్మించిన ఏటీసీ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.

సాధారణ విద్యనభ్యసించిన విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి పెంపొందించి జీవితంలో స్వయంసమృద్ధి సాధించేందుకు ఏటిసీ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు. ఆధునిక విద్యను అందించడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా అధికంగా ఉన్నందున ఆసక్తిగల విద్యార్థులు ఏటీసీల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఐటిఐ కళాశాలలో దశాబ్దాల నాటి కోర్సులే నేటికీ కొనసాగుతుండడంతో అందులో చదువుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు.

ఎంతోమంది ఉన్నత చదువులు చదివి నైపుణ్యం లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చదువుతో సంబంధం లేకుండా ఏటీసీలో శిక్షణ తీసుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణను ఇస్తున్నారని అన్నారు. నిర్వాహకులు విద్యార్థులకు నాణ్యమైన పెట్టిన అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.