18-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల, జూలై 17 ( విజయక్రాంతి ) : రైతులు ఉత్పత్తి చేసిన పత్తి విత్తనాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, ఎలాంటి సమస్యలు రాకుండా విత్తన కంపెనీలు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. గురువారం ఐడీఓసీ సమావేశ హాల్లో పత్తి విత్తన కొనుగులుపై వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ కంపెనీల ప్రతినిధులు, సీడ్ ఆర్గనైజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వారు పండించిన పత్తి విత్తనాలను కచ్చితంగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. పత్తి విత్తనాలు జిల్లాలో ప్రధాన ఆదాయ మార్గమని జిల్లాలో 40 వేల ఎకరాల్లో రైతులు పత్తి విత్తన సాగు చేస్తున్నారని తెలిపారు.
35 కంపెనీల ద్వారా పంపిణీ చేసిన విత్తనాల ప్రకారంగా రైతులు పండించిన సీడ్ పత్తి విత్తనాలను వారికి లాభం చేకూరే విధంగా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల అపోహలను తొలగించే విధంగాకంపెనీలు పండిన పూర్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నట్లు లిఖితపూర్వక హామీ పత్రం వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
రైతుల శ్రమను వృథా చేయకుండా వారు పండించిన పంట మొత్తాన్ని సీడ్ కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. గత రెండు రోజులుగా జిల్లాలో ఏర్పడిన సమస్యను పరిష్కరించే విధంగా పూర్తి సహకారం అందించాలని కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ సూచించారు. రైతుల హక్కులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహాలను ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వం రైతులకు అండగా.....
అనంతరం ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని,వారికి న్యాయం జరిగేలా ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈరోజు జరిగిన సంఘటనలపై అపోహలు నమ్మరాదన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తిన జిల్లా యంత్రాంగానికి తెలియపరిచినట్లయితే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మాట్లాడి, సీడ్ పత్తి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనేలా కంపెనీల ప్రతి నిధులను ఒప్పించడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి ఈ మేరకు లిఖితపూర్వక హామీ పత్రం తీసుకోవడం జరిగిందన్నారు.
అపోహలను నమ్మవద్దని రైతులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్,ఏ డి ఎ సంగీతలక్ష్మి, సీడ్ కంపెనీల ప్రతినిధులు, సీడ్ ఆర్గనైజర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.