calender_icon.png 11 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్‌లో సెమిస్టర్!

06-12-2024 01:31:44 AM

  1. ఏడాదికి రెండుసార్లు 
  2. అభిప్రాయాలు సేకరిస్తున్న విద్యాకమిషన్

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ యోచిస్తున్నది. పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని అమలుచేసేందుకు కమిషన్ సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు మార్చిలోనే వార్షిక పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఎప్పటినుంచో ఈ విధానమే అమలవుతోంది. సిలబస్ ఎక్కువగా ఉండటం, ఒకేసారి మొత్తం సిలబస్ చదవడం, రాయడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని అమలుచేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని తెలంగాణ విద్యా కమిషన్ పరిశీలిస్తోంది. ఏడాదికి రెండుసార్లు సెమిస్టర్లు పెట్టాలని యోచిస్తున్న ట్లుగా సమాచారం.

ఇప్పుడున్న విధానంలో ఒకేసారి పరీక్షలు విద్యార్థులకు నిర్వహించకుండా ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఆరు నెలలకొకటి చొప్పున ఫేజ్ ఫేజ్ పద్ధతిలో సెమిస్టర్లు నిర్వహించడంపై అభిప్రాయాలను సేకరిస్తోంది.

దీనివల్ల ఎలాంటి సత్ఫలితాలుంటాయి? ఇప్పుడున్న విధానం యథావిథిగా కొనసాగిస్తే ఎలా ఉంటుంది? అని ఉపాధ్యా యుల నుంచి అభిప్రాయాలను కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలుసుకుంటున్నట్లు సమాచారం.

ఈనెల 2న ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలోని జీళ్ల చెరువు గ్రామంలోని హైస్కూల్‌ను ఆయన సందర్శిం చారు. ఈ సందర్భంగా పదో తరగతిలో సెమిస్టర్ విధానం అమలుచేస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పాలని ఉపాధ్యాయుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు. నాడు అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అక్కడి ప్రభుత్వ విద్యావిధానంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు రెండేళ్ల క్రితమే అప్పటి పభుత్వం ప్రకటించింది.

తొలుత ఒకటి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు,  తర్వాత పదో తరగతిలో ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు. అయితే పుస్తకాలు సెమిస్టర్లు తరహాలో ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అక్కడ సెమిస్టర్ విధానం అమలు కావడంలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంపై అపార అనుభవం ఉన్న ఆకునూరి మురళిని విద్యాకమిషన్ చైర్మన్‌గా రేవంత్ సర్కార్ నియమించింది.

ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ)లో భాగంగా సెమిస్టర్ విధానాన్ని పీజీ, డిగ్రీలోనే కాకుండా ఇంటర్, టెన్త్‌లోనూ తీసుకొచ్చేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాకమిషన్ రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకోరానున్నట్లు తెలుస్తోంది. 

రేపటితో జిల్లాల పర్యటనలు లాస్ట్..

ప్రస్తుతం తెలంగాణ విద్యా కమిషన్ జిల్లాల విస్తృత పర్యటనలు చేపడుతోంది. ఇందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ విద్యా కమిషన్ రోజువారి పర్యటనలు చేస్తోంది. ఈ నెల 7న కమిషన్ జిల్లాపర్యటన ముగియనున్నది. కమిషన్ చైర్మన్‌తోపాటు, సభ్యులు సైతం జిల్లాల్లో పర్యటిస్తూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

విద్యాభివృద్ధికి ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై ఉధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, విద్యారంగ నిపుణుల అభిప్రాయాలను కమిషన్ తెలుసుకుంటోంది. విద్యావిధానంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందనే లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది.

పాఠశాల విద్యపై ప్రభుత్వానికి ఈ నెలలో లేదా జనవరిలో ఓ నివేదికను కమిషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. సెమిస్టర్ విధానంపై ఆకునూరి మురళిని విజయక్రాంతి ప్రతినిధి మొబైల్ ఫోన్‌లో వివరణ కోరగా ఆయన స్పందించలేదు.