06-12-2024 12:41:11 AM
ఏడాదిలో తెచ్చిన అప్పులు రూ.52,118 కోట్లు
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఒకవైపు అస్తవ్యస్తం గా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే.. మరోవైపు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నికల సమయంలో ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పథకాలకు రూ.61,194 కోట్లను ఖర్చు చేసినట్లు ప్రభు త్వం చెప్తోంది.
సంక్షేమ తెలంగాణ దిశగా అడుగులు వస్తున్న ట్లు ప్రజాపాలన విజయోత్సవాల వేళ ప్రభుత్వం చెప్తోంది. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులను వెచ్చించింది. రుణమాఫీతోపాటు రైతుభరోసా, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్‌కు భారీగా నిధులు ఖర్చు చేసింది.
భారీగా ఉన్న అప్పులను తగ్గించి.. తెలంగాణను ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి చెప్తూ వస్తోంది. చెప్పిన విధంగానే అప్పులను భారీగా తగ్గించుకున్నది.
గత ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించినట్లు ప్రభుత్వం చెప్తోంది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానాన్ని అనుసరించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలోని ఆర్థిక స్థితిగతులపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7లక్షల కోట్లు అప్పులు చేసినట్లు ప్రకటించారు.
ఆ అప్పులు వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయని వెల్లడించారు. ఈ ఏడాది పాలనలో ఆ ఇబ్బందులను అధిగమించి ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
ఒకటో తారీఖే ఉద్యోగులకు జీతాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉద్యోగులకు జీతాలు సరిగా పడని పరిస్థితి ఉండేది. దీంతో అధికారంలో వచ్చిన వెంటనే ఒకటో తారీఖే జీతాలు వేసే పద్ధతిని ప్రభుత్వం పునరుద్ధరించింది. అంతేకాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు లక్ష కోట్ల బిల్లులను క్రమపద్ధతిలో చెల్లిస్తోంది.
ప్రజలపై అప్పుల భారం మోపకుండా, మొదట వాటిని తీర్చడంపై ఫోకస్ పెట్టింది. గత సర్కారు ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అందుకే రేవంత్‌రెడ్డి సర్కారు తెచ్చిన అప్పులకంటే.. వడ్డీలు, కిస్తీలకు కట్టి మొత్తమే ఎక్కువ ఉండటం గమనార్హం.
2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు రాష్ర్ట ప్రభుత్వం రూ.52,118 కోట్లు అప్పులు తీసుకుంది. ఇదే కాలంలో సర్కారు రూ. 64,516 కోట్లు అసలు, వడ్డీలు కలిపి కిస్తీలను చెల్లించింది. ఒకవైపు అప్పులను తీర్చుతూనే మరోవైపు గ్యారెంటీలను అమలు చేసింది.
రూ.20,617 కోట్ల రుణమాఫీ
ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూ మరోవైపు రైతులకు ఏకకాలంలో రూ.20,617 కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. రైతు రుణమాఫీ అనేది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కావడంతో ఎంతో శ్రమించి నిధులను సమీకరించి రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొంటుంది. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించటంలో ఆర్థికశాఖ కీలకపాత్రను నిర్వర్తించింది.
రుణమాఫీ ద్వారా రాష్ర్టంలోని 25.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి చేయడంతో పాటు విపత్తులను కూడా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించింది.
హామీల అమలు..
ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహాలక్ష్మి, గృహజ్యోతితోపాటు యువ వికాసాన్ని అమలుచేసింది. వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిం ది. 54,520 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పూర్తి చేసింది.
రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచితగృహ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, బియ్యం సబ్సిడీ, స్కాలర్షిప్‌లు, డైట్ ఛార్జీల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలన్నింటికీ కలిపి రూ.61,194 కోట్లు ఖర్చు చేసింది. ఇదికాకుండా, బీసీ, మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నవంబర్ నాటికి ప్రభుత్వం రూ.9,888 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది.
ఏడాదిలో ప్రభుత్వం పథకాలకు పెట్టిన ఖర్చు (కోట్లలో)
పథకం ఖర్చు
రైతు భరోసా రూ.7,625
రైతు రుణమాఫీ రూ.20,617
చేయూత రూ.11,382
రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.890
గ్యాస్ సబ్సిడీ రూ.442
ఉచిత విద్యుత్ రూ.1,234
విద్యుత్ సబ్సిడీ రూ.11,141
రైతు బీమా రూ.1,514
బియ్యం సబ్సిడీ రూ.1,647
ఉపకార వేతనాలు, డైట్ చార్జీలు రూ.1,016
మహిళల ఉచిత ప్రయాణం రూ.1,375
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,311
మొత్తం రూ.61,194