24-07-2024 12:21:24 AM
రాజకొండ సీపీ సుధీర్‌బాబు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారిలో అవగాహన పెంచేందుకు పోలీసు స్టేషన్లు, కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లను మంగళవారం నేరేడ్‌మెట్‌లోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ ‘ఫేస్‌బుక్’ ‘ఇన్‌స్టాగ్రామ్’ వంటి సామాజిక మాధ్యమాల ఖాతాలు, యూట్యూబ్ ఛానళ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రతి పోలీసు స్టేషన్ ఆవరణలో, రిసెప్షన్ కౌంటర్లలో పోలీస్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా మొబైల్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లకు సులభంగా చేరుకొని సబ్ స్ర్కైబ్ చేసుకోవచ్చని, ఫాలో కావొచ్చని చెప్పారు. వీటి ద్వారా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ నంబర్ 8712662111 ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు రాజేశ్‌చంద్ర, ప్రవీణ్ కుమార్, కరుణాకర్, అరవింద్‌బాబు, సునీతారెడ్డి, ఉషా విశ్వనాథ్ పాల్గొన్నారు.