24-07-2024 12:19:50 AM
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): సంస్కృతాంధ్ర సారస్వతాలలో విశేష కృషి చేసిన మహనీయులను గౌరవించడం మన ధర్మమని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచారి అన్నారు. మంగళవారం ఆయన అధ్యక్షతన స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థలో శలాక విద్వత్ సమర్చన 9వ పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పుంభావ సరస్వతి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకి విద్వన్మణి, సరస్వతీ పుత్రులు శలాక రఘునాథ శర్మ దంపతులకు పురస్కారాన్ని అందించారు.
అనంతరం రమణాచారి మాట్లాడుతూ.. గత పదేళ్లుగా తాను అన్నజ్ఞాన సమారాధన చేస్తున్నానని, ఈసారి ఆచార్య సుప్రసన్నకు పురస్కారం అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పేరంబుడూరు శ్రీరంగాచార్యులు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య యాదగిరి, డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ, డాక్టర్ వర్జుల రంగాచార్య, ముత్యం రామ్మోహన్, డాక్టర్ వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.