18-11-2025 07:11:11 PM
జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్..
గద్వాల: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల పురపాలిక పరిధిలోని జమ్మిచేడు గ్రామం వద్ద మెప్మా ఆధ్వర్యంలో, ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారో నిర్వాహకులను అడిగారు. తేమ శాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద ఆరపెట్టిన ధాన్యాన్ని చూశారు. కేంద్రానికి కేటాయించిన టార్పాలిన్లు, గన్ని సంచుల వివరాలను అడిగారు.
రైతుల సాగు ధ్రువీకరణకు సంబంధించి ఆయా కేంద్రాల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చే టోకెన్స్ పరిశీలించారు. పొలం యజమానుల చేనుల్లో పంటలు సాగుచేసిన కౌలు రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేశాక వివరాలను యాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలను ట్యాబ్ లో ఓపిఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టం) ఎప్పటికప్పుడు నమోదు చేయకపోవడం సరికాదని, ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఐకెపి డిపిఎం అరుణ, ఏపీఎం సలోమి, గద్వాల మండల వ్యవసాయ శాఖాధికారి ప్రతాప్ కుమార్, ఏఈఓలు ప్రవళిక, నరేష్, మెప్మా అధికారులు శ్రీకర్, వెంకటేశ్వర్లు, మహాలక్ష్మి, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.