01-07-2025 02:49:44 AM
నాగార్జునసాగర్, జూన్ 30: అనుమానస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత గడ్డిమందు తాగించి హత్య చేసినట్టు తెలుస్తున్నది. నల్లగొం డ జిల్లా గుర్రంపోడు మండలం జునుతుల గ్రామానికి చెందిన మంకెన జ్యోతి, శ్రీనివాస్‌రెడ్డి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు.
ఉపాధి నిమిత్తం మిర్యాలగూడలో నివాసముంటున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మహేష్ జునుతుల గ్రామానికి వలస వచ్చి, అదే గ్రామంలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. జ్యోతి మిర్యాలగూడ నుంచి అప్పుడప్పుడు సొంత గ్రామానికి వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే ఆర్‌ఎంపీగా పని చేస్తున్న మహేశ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు తెలుస్తున్నది. కొన్నేళ్లు వారి బంధం కొనసాగగా.. ఇటీవల ఆమెను వదిలించుకోవడానికి మహేష్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
ఆదివారం అర్ధరాత్రి దేవరకొండ నుంచి కారులో జ్యోతిని తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మహేష్ ప్లాన్ ప్రకా రం తన వెంట తీసుకెళ్లిన గడ్డి మందును జ్యోతికి బలవంతంగా తాగించడంతో అపస్మా రక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను పూడ్చిపెట్టేందుకు కారు లో తీసుకెళ్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు.
వెంబడించిన పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమ ధ్యంలోనే మృతి చెందింది. అయితే జ్యోతిపై లైంగిక దాడి జరిపి, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి, బందువులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గుర్రంపోడు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు.