01-07-2025 07:57:21 PM
హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూశారు. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ఖైరతాబాద్ లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. డా. పట్టాభిరామ్ మెజీషియన్‌గా, హిప్నాటిస్టుగా, రచయితగా, సైకాలజిస్ట్‌గా, కౌన్సిలర్‌గా విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. ఆయనకు భార్య జయ, కొడుకు ప్రశాంత్ ఉన్నారు. ఆయన మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ పార్థివదేహం ఉంచనున్నారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పట్టాభి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ సంతానంలో బీవీ పట్టాభిరామ్ పదిహేనవది. ఆయన పూర్తి పేరు భావరాజు వెంకట పట్టాభిరామ్. పట్టాభిరామ్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో పలు రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రుల అవగాహన సదస్సులు నిర్వహించారు.