01-07-2025 08:01:13 PM
సింగరేణి ఏరియా జిఎం దేవేందర్...
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో గడిచిన జూన్ మాసానికి గాను నిర్దేశించిన లక్ష్యంలో 69 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్(Singareni Area GM G Devender) తెలిపారు. మంగళవారం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేకే ఓసీపిలో ఓబి వెలికి తీయకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని, భూగర్భగనుల్లో కార్మికుల గైర్హాజరు మూలంగా బొగ్గు ఉత్పత్తి ఆశించిన మేర సాధ్యం కాలేదని ఆయన స్పష్టం చేశారు. భూగర్భ గనుల్లో ఎస్డిఎల్ మిషన్లకు అవసరమైన విడిభాగాల ఏర్పాటుకు, టబ్బుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
యూనియన్ నాయకుల సహకారంతో భూగర్భ గనుల్లో కార్మికుల గైర్హాజర్ నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకుల సహకారంతో భూగర్భ గనుల్లో వందశాతం బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కేకే 5 గని నుండి నీటి సరఫరా నిలిచి పోయే అవకాశం ఉన్నందున చేతులపూర్ లో నూతనంగా మూడు బోర్వెల్ లను ఏర్పాటు చేసి నీటి సరఫరా ప్రారంభించామన్నారు. కేకే ఓసీపి లో పిఓపి ప్లాంట్ ను త్వరలో ప్రారంభిస్తు న్నామని తద్వార భవిష్యత్తులో కాసిపేట 1, కాసిపేట 2 గనుల్లో సాండ్ స్టోవింగ్ డీ పిల్లరింగ్ కు అంతరాయం లేకుండా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్ ఓ టు జిఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఐఈడి కిరణ్ కుమార్, డివైపిఏం ఆసిఫ్, సివిల్ ఎస్ ఈ రాము, సీనియర్ పిఒ శంకర్ లు పాల్గొన్నారు.