01-07-2025 07:37:18 PM
ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి...
చండూరు/గుర్రంపోడు (విజయక్రాంతి): గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళపై అత్యంత దారుణంగా ఆర్ఎంపీ మహేష్ గడ్డి మందు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారం చేసి చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి(Paladugu Prabhavathi) ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇటీవల కాలంలో మహిళలను మాయ మాటలు చెప్పి లొంగదీసుకుని అలుసుగా భావించి అత్యంత దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్ఎంపి తన అత్తకు వైద్యం చేస్తానని పేరుతో తోడుగా వచ్చిన మహిళలను కారులో ఎక్కించుకొని చంపి సాక్ష్యం లేకుండా ఎక్కడో పడేయాలని క్రిమినల్ మైండ్ తో వ్యవహరించిన మహేష్ ను అత్యంత కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలలలోపే నిందితునికి కఠిన కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మహిళలు వృద్ధులు చిన్నారులపైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయని మద్యం మత్తు పదార్థాలు సేవించడం వలన అనేక దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. క్రిమినల్ నేరస్తులను గుర్తించి పోలీసులు కఠినంగా శిక్షించాలని వారికి సరియగు కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరారు. జ్యోతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.