15-10-2025 04:37:32 PM
మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్..
కాటారం (విజయక్రాంతి): ఐటీఐ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాలేజీ ఎదుట ఎస్.ఎఫ్.ఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరన్, కుమ్మరి రాజు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఏర్పాటు చేసిన ఐటీఐ కాలేజీలో కనీస వసతులు కరువయ్యాయని దుయ్యబట్టారు. సుమారు 80 మంది విద్యార్థులు ఇందులో ఉండగా.. కేవలం 20 మందికి మాత్రమే బెంచీలు ఉండడం శోచనీయమని అన్నారు.
కాలేజీ తరగతి గదులలో చీకట్లు అలముకున్నాయని, విద్యుత్తు దీపాలు కూడా అమర్చడం లేదని వారు విమర్శించారు. సుదూర ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వస్తున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా పాలన యంత్రాంగం తక్షణమే ఐటిఐ కాలేజీలో సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా సదుపాయాలు కల్పించని ఎడల భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ కాలేజీ కమిటీ సభ్యులు వికాస్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.