calender_icon.png 25 November, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ గాలికి సంకెళ్లు!

25-11-2025 12:00:00 AM

మనిషి గాలి పీల్చి స్వేచ్ఛగా బతికేందుకు కూడా విజ్ఞప్తులు, నిరసనలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. వాయు కాలుష్యం కోరల్లో చిక్కిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు కలుషిత గాలిని పీల్చి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాయు కాలుష్యం కట్టడి విషయంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమవ్వడంతో సామాన్యులే రోడ్లపైకి వచ్చి ‘మాకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే ఏర్పాట్లు చేయండి’ అంటూ నిరసనలు వ్యక్తం చేయడం ఆందోళనకరం.

ఈ నేపథ్యంలో ఢిల్లీ లో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుండడంతో ఆదివారం సా యంత్రం ఇండియా గేట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలు ప్లకార్డులు చేతబట్టి మెరుపు ఆందోళనలు నిర్వహించారు. అయితే నిరసనలకు అనుమతి లేకపోవడంతో ఇండియా గేట్ వద్ద బైఠాయించిన ఆందోళనకారుల ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది కారం పొడితో దాడికి దిగారు.

ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగగా, నిరసనకారులపై కేసు నమోదు చేసిన పోలీసులు 39 మందిని అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా ఢిల్లీని వెంటాడుతున్న వాయు కాలుష్య భూతం ఈ ఏడాది తన కోరలను మరింత చాచినట్లుగా అనిపిస్తున్నది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నది. రోహిణి (458), ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (444), ఆనంద్ విహార్ (442), బవానా (439), అశోక్ విహార్ (436), అలీపూర్ (412) సహా చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో ఉంది.

దీనివల్ల ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరికి గురవుతూ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యం దెబ్బకు విద్యాసంస్థలు మూసేయగా, విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడుతున్నది. వాయు కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉం చుకుని 50 శాతం ప్రభుత్వం ఉద్యోగులకు ఇంటి నుంచి పని కల్పించగా.. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వాయు కాలుష్యం తీవ్రం కావడంతో పాఠశాలల స్పోర్ట్స్, అథ్లెటిక్స్ కార్యక్రమాలను వాయిదా వేయాలని ‘వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎమ్) పేర్కొంది. కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకున్న క్రమంలో స్పోర్ట్స్ మీట్‌లను నిర్వహించడం స్కూల్ పిల్లలను గ్యాస్ ఛాంబర్‌లో పెట్టినంత సమానమని తెలిపింది. ఈ స్థితిలో బహిరంగంగా క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల తీవ్రమైన శ్వాసకోస సమస్యలు తలెత్తే ప్రమాదముందని పేర్కొంది.

వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సహా కేంద్ర ప్రభుత్వం పరిష్కార మార్గాలు వెతకాల్సిన అవసరముంది. పంట వ్యర్థాలను కాల్చడం నిషేధించడంతో పాటు ఇళ్లలో కట్టెలకు బదు లు గ్యాస్‌ను వాడేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వాహనాల వినియోగం, నిర్మాణాలు, బొగ్గు ఆధారిత ప్లాంట్‌కు ప్రత్యామ్నాయాలు, పరిశ్ర మల తరలింపు లాంటి చర్యలు తీసుకోవాలి.

పదేళ్ల కిందట వాయు కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా రాజధాని బీజింగ్ సమస్యను విజ యవంతంగా అధిగమించింది. కాలుష్యం ప్రమాదాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం 100 పరిశ్రమలను మూసేయడంతో పాటు దాదాపు 2 కోట్ల పాత వాహనాలను తుక్కు కిందకు మార్చేసింది. ఇలాంటి సున్నిత సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.