calender_icon.png 25 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపులకు స్వస్తి పలకాలి!

25-11-2025 12:00:00 AM

నేడు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం :

‘లింగ వివక్షత’.. ఈ ఆధునిక యుగంలో  కొనసాగుతున్న అనాగరిక చర్య. మహిళలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగనీయకుండా మహిళల పట్ల వివక్షతా భావం ప్రదర్శించడం, వారిని పలు రకాలుగా  హింసించి, వేధించడం అమానుషత్వం. మహిళల కోసం అనేక చట్టాలు అమల్లోకి వచ్చినా వారిపై ఇప్పటికీ అణచివేత, లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ  మహిళల పాలిట శాపంగా మారింది.

వర్తమానంలో మహిళల పట్ల కొనసాగుతున్న అత్యాచారాలు, హత్యలు అత్యంత ఆందోళనకరంగా ఉంటు న్నాయి. సమాజంలో నెలకొంటున్న పశు ప్రవృత్తి, పైశాచికత్వం మగువలకు ధరిత్రిపై నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. అనునిత్యం మహిళలపై కొనసాగుతున్న అమానవీయ చర్యలు మనిషి పుట్టుకను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. సామాజిక మాద్యమాల్లో  వెల్లువెత్తుతున్న అశ్లీల దృశ్యాల ప్రభా వం యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రేమ పేరుతో యువత పెడదారి ప డుతున్నది. ఆధునిక సమా జంలో ఇలాంటి ఆటవిక నైజానికి ము గిం పు పలకాల్సిన అవసరముంది. ఈ నేప థ్యంలోనే ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా నవంబర్ 25న స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు, వివిధ రూపా ల్లో వారిపై కొనసాగుతున్న మానసిక, శారీరక హింసకు వ్యతిరేకంగా ‘అంతర్జాతీయ స్త్రీ హింసా నిరోధక దినోత్సవం’ నిర్వహించాలని తీర్మానం చేసింది. ఇందులో భాగంగా చిన్న వయసులోనే నైతిక విలువలకు బీజం పడాలి.

మహిళలకు తమ హక్కులపై అవగాహన కలిగించడం, తమను తాము రక్షిచుకోవడం వంటి విషయాల్లో అవగాహన కలిగించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. విజ్ఞానం వికసించినా ఇంకా ప్రపంచంలో పలుచోట్ల లింగవివక్షత కొనసాగుతున్నది. స్త్రీ అనే నెపంతో నిర్ధాక్షిణ్యంగా నిందలేసే సమాజం ఏర్పడింది. స్త్రీ స్వేచ్ఛను గౌరవించి, స్త్రీల స్వాతంత్య్రానికి విలువనిచ్చే పురుషులపై శీలహనన చర్యలు కొనసాగడమనేది కేవలం కల్పిత కథలు మాత్రమే.

నేడు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లోనూ సమానంగా రాణిస్తున్నారు. మగువలను అడ్డం పెట్టుకుని బ్యాక్ సీట్ డ్రైవింగ్ పేరుతో వారి అధికారాలను అడ్డదారిలో అనుభవిస్తున్న పురుష నైజం మారాల్సిన అవసరముంది. తరతరాల బానిసత్వంలో మగ్గిపోయిన మహిళా లోకం చీకటి తెరలను చీల్చుకుని, వెలుతురు వైపు పయ నిస్తున్నది. ఇది ఎవరో వేసిన భిక్ష కాదు. ఆర్థిక స్వేచ్ఛ మహిళల హక్కు. ఆర్థిక స్వావలంభనకై మగువలు సాగిస్తున్న పోరు మహత్తరమైనది. 

అతివ లేనిదే మానవ మనుగడ శూన్యం. ఇది జగమెరిగిన సత్యం. వర్తమానం వనితలకు విలువిచ్చే విధంగా పరివర్తన చెందింది. మహిళలకు గౌరవమిచ్చే మంచి రోజులు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ జాతి సాధించిన విజయాలను స్ఫురణకు తీసుకురావాలి. మహిళల వివాహ వయోపరిమితిని పెంచడం, భారత పార్లమెంటులో మహిళల రిజర్వేషన్ల బిల్లు ఆమోదించడం హర్షించదగ్గ పరిణామాలే అయినప్పటికీ, మహిళల విషయంలో ఇంకా పూర్తి స్థాయి మానసిక పరివర్తన అవసరం. మహిళల పై కొనసాగుతున్న హింసకు స్వస్తి పలికిన రోజే ప్రగతికి శుభసూచకం.

- సుంకవల్లి సత్తిరాజు, 9704903463