10-07-2025 12:51:00 AM
వరంగల్ (మహబూబాబాద్) జూలై 9 (విజయ క్రాంతి): వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాకాంబరి వేడుకలను పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 3 గంటల నుండి నిత్యాహ్నికం నిర్వర్తింపబడిన అనంతరం అమ్మవారికి పలువిధములైన శాకములతో శాకంభరీ అలంకారము ప్రారంభమగును.
ఈ అలంకారము ఉదయం 9 గంటల వరకు జరుగుతుందని, అలంకారము జరుపుచున్న సందర్భములో భక్తులు అమ్మవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. శాకాంబరి అలంకారానికి సుమారు 6 గంటల వ్యవధి పడుతుందని, ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు.
శాకంబరి వేడుకల సందర్భంగా సర్వదర్శనముతో పాటు విశిష్ట దర్శనం, అతి శీఘ్రదర్శనం కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాకాంబరి వేడుకల సందర్భంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించడానికి మహబూబాబాద్ పట్టణానికి చెందిన జీకే రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రకాల కు చెందిన 8 క్వింటాళ్ల కూరగాయలను సమర్పించారు.