01-01-2026 12:20:37 AM
వరంగల్ (మహబూబాబాద్) డిసెంబర్ 31 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బంధనపల్లి గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే బుధవారం తెల్లవారుజామున దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇటీవలే చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తికావడంతో త్వరలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విగ్రహానికి నిప్పు పెట్టిన విషయం ఉదయం గ్రామస్థులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న వారు మంటలు ఆర్పి వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు ఆకతాయిలు పాల్పడ్డారా, లేక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. దుశ్చర్యకు పాల్పడ్డ దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అంటూ గ్రామస్తులు పోలీసులను కోరారు.