24-05-2025 02:02:14 AM
ఆచార్య మసన చెన్నప్ప :
ఆస్ట్రేలియాను దర్శించాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ‘ఆస్ట్రేలియా తెలుగు సంఘం’ ఆహ్వానం మేరకు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజతో కలిసి వెళ్లాను. అక్కడి తెలుగు సం ఘం ౨౦౧౨ మార్చి ౩౧న ఉగాది సందర్భంగా ‘రసరాగ సుధ’ పేరుతో ఒక కా ర్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమానికి మెల్‌బోర్న్ వేదికయింది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, మిమిక్రీ ఆర్టిస్ట్ చిట్లూరి గోపీచంద్, నేనూ ఆహ్వానితులం.
అశోక్‌తేజ తాను రచించిన సినిమా పాటలను గొంతెత్తి ఆలపించి సభికులను ఉ ర్రూతలూగించారు. చిట్టూరి గోపీచంద్ మిమిక్రీ చేస్తూ సందడి చేశారు. నేను తె లుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు సంస్కృ తి గొప్పతనాన్ని పద్యాల రూపంలో, ము త్యాల సరాల రూపంలో వినిపించాను. ప్రత్యేకించి దాంపత్య ధర్మం గురించి పద్యాలు పాడాను. ఉదాహరణకు ఒక పద్యం ఇలా..
‘సెనగ, కంది, పెసర చెలువొంద ప్రతిగింజ
రెండు పలు లొప్పుచుండ కలిసి
దనరుచుండునటుల దాంపత్యమనుగింజ
పలుకలనెడి భార్యాభర్తతోడ’
ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షుడు, నా మిత్రుడు ధర్మపురి మురళి మం చి హాస్యకవి. ‘మనకు వచ్చినా రానట్లు మాట్లాడేది తెలుగు, రాకున్నా వచ్చినట్లు మాట్లాడేది ఇంగ్లిషు’ అని మురళి చమత్కరించినప్పుడు సభలో కరతాళ ధ్వనులు మార్మోగడం ఇప్పటికీ నాకు గుర్తుంది.
అది ఒక విశ్వ వేదిక కనుక ‘నింగి శాంతి నేల శాంతి; అంతరిక్షం శాంతి శాంతి; నీరు శాంతి గాలి శాంతి; విశ్వమంతా శాంతి శాంతి’ అంటూ శాంతి గీతాలు వినిపించాను. ఇది వేదంలోని శాంతి మంత్రానికి నా అనువాదం. తమ పిల్లలు పరాయి దేశంలో ఉద్యోగాలు చేస్తుంటే, కన్నవాళ్లు భారతదేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్తూ ఒక కవిత వినిపించాను.
‘పదాలిక్కడ పెదాలక్కడ
గేయాలిక్కడ గాయాలక్కడ
కోయిలిక్కడ వసంతమక్కడ
మెరుపులిక్కడ మేఘాలక్కడ
చిరునవ్వులిక్కడ సింగరేణులక్కడ’
..ఇక్కడంటే ఆస్ట్రేలియాలోనని. అక్కడంటే భారతదేశంలోనని. ఆ కవిత అక్కడికక్కడ అల్లిన కవిత. అది అందరినీ ఆకట్టుకున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మేం రెండురోజులు సిడ్నీలో ఉన్నాం. అక్కడ మాకు డాక్టర్ జయ, డాక్టర్ రవి సీతాంరాజు ఆతిథ్యమిచ్చారు. మేం వస్తున్నామని డాక్టర్ జయ ఇంటిని బాగా అలంకరించారు. వారి ఇంటి ముందర వేసిన ముగ్గులు నన్నెంతో ఆకర్షించాయి. వెంటనే నేను ముగ్గుపై పద్యం అల్లాను.
‘ఇంటి ముందర ముగ్గు
ఇంతిమోమున సిగ్గు
పరిసరాలకే నిగ్గు
ఓ కూనలమ్మా !’
..అంటూ వినిపించాను. డాక్టర్ జయ సిడ్నీ తెలుగు రేడియో డైరెక్టర్‌గా ఉన్నారు. అప్పుడు మా ఇంటర్వ్యూలు ఆమె వల్ల 2012 ఏప్రిల్ 14 నాడు అక్కడి తెలుగు రేడియోలో ప్రసారమయ్యాయి. నేనెక్కడికి వెళ్లినా అక్కడి ఆ యాత్రకు సంబంధించిన విశేషాలను గ్రంథస్థం చేయడం నాకు అలవాటు. అలా నేను అమెరికాకు వెళ్లినప్పుడే ‘నయాగరా’ కావ్యం ఆవిర్భవించింది. ఇట్లే ఆస్ట్రేలియాకు వెళ్లిన సందర్భంగా ‘శుకోపనిషత్తు’ అనే కావ్యం వచ్చింది.
ఉపనిషత్తుల ఉషస్సులు
ఒకరోజు ఉదయం మురళి ఓ పార్కుకు తీసుకెళ్లాడు. పార్క్ మధ్య అందమైన సరస్సు. ‘సరస్సు ఒడ్డున కూర్చొని, సరోవర అందాన్ని ఆస్వాదించండి’ అని మురళి చెప్పగానే నేనక్కడే నిలిచిపోయా ను. నాముందున్న ఒక పూలచెట్టు మీద రెండు చిలుకలున్నాయి. అవి నిజంగా తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన పక్షుల్లానే ఉన్నాయి. వాటిని చూడగానే.. నాలోని కవికి వాటితో మాట్లాడాలనిపించింది.
‘మీరెక్కడి నుంచి వచ్చారు. నాలాగా మీరూ తెలుగు వారేనా?’ అని అడుగుదామనుకున్నంతలో అవి నా హృదయాన్ని కనిపెట్టి ‘మేమూ తెలుగు వారమే’ అని సమాధానమిచ్చాయి. చిలుకల పలుకులెంతో మధు రమనిపించాయి. తర్వాత ‘ఇక్కడికెందుకున్నారు’ అనేది నా ప్రశ్న. ‘దానికో కారణం ఉంది. వినే ఓపిక మీకుందా’? అని చిలుకలు ఎదురు ప్రశ్న వేశాయి. చెప్పమని చిలుకలను ప్రేమతో అడిగాను.
‘మన తెలుగు ప్రాంతం నుంచి ఇద్దరు ప్రేమికులు మమల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ కుదరని పరిస్థితుల్లో ఆ ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారితో మేం కలిసే ఉన్నాం. కానీ, ఆ దంపతుల జంట ఇప్పుడు విడిపోయింది. కలిసి ఉండవలసినవారు విడిపోవడం వల్ల, మాకిబ్బంది కలిగి, మేం వారిని విడిచి ఈ తోటలోకి వచ్చాం’ అని ఆ చిలుకలు తమ వృత్తాంతాన్ని చక్కగా వివరించాయి. చిలుకల వృత్తాంతాన్ని ఇలా పద్యంలో ఇమిడ్చాను.
‘ఇద్దరొకచోటనున్న మేమిద్దరమును
సుఖముగా పంజరమ్మును జొచ్చినాము
దంపతుల యెడబాటుచే తల్లడిల్లి
కొలను పాలైతి మీ రీతి గూడులేక’
చిలుకలు మీదనే కాక, వాటినిక్కడికి తెచ్చిన ఆ ప్రేమికుల మీద కూడా నాకు జాలి కలిగింది.
‘ఇప్పుడా దంపతులు గలరేడ? మనుచు
చిలుకలను నేను ప్రశ్నస్తి చెలిమితోడ
అవియి కన్నీరు గార్చుచునదియు మాకు
తెలియదనచు పలికినవి దీనముగాను’
అయ్యో.. వారెవ్వరో కానీ, నాకు కలిస్తే బాగుండు గదా.. అని మనసులో నేను దేవుణ్ణి ప్రార్థించాను. ఇంతలో మురళి, అశోక్‌తేజ రానే వచ్చారు. ముగ్గురం కలిసి తిరిగి ఇంటికెళ్లాం. ఆ రోజు ఆదివారం. బహుశా అక్కడి వారికీ ఆదివారం సెలవుదినమే. ఉదయం స్నాన సంధ్యలు తీర్చు కొని, స్వల్పాహారం ముగించుకొని, టీవీ చూస్తున్న మాకు డోర్ చప్పుడు వినిపించింది. మురళీ మిత్రుడొకాయన మమ్మల్ని కలవడానికి వచ్చినట్లు తెలిసింది. వెంటనే టీవీ చూడడం ఆపేసి నేను వచ్చిన అతిథితో మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ మిత్రుడు ఎన్నో విషయాలు చెప్పి, కొంత విషాదానికి లోనయ్యాడు. ‘ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కష్టాలు తప్పవనిపిస్తుంది’ అన్నాడు. ‘భూమి మీద మనం ఎక్కడికి వెళ్లినా మన సుఖాలతో పాటు, మన కష్టాలు కూడా మన వెంటనే ఉంటాయి’. కానీ స్వదేశంలో ఉన్నప్పుడు కలిగిన సుఖం, వేరే దేశంలో దొరక్కపోతే అదెంతో కష్టమనిస్తుంది’ అన్నాడు. అప్పుడా మిత్రుడు తన భార్యకు దూరంగా ఉన్న సంగతి తెలియజేశాడు. ఆ సమయంలోనే మళ్లీ డోర్ చప్పుడైంది. మురళి మళ్లీ వచ్చినవారిని లోపలికి ఆహ్వానించాడు. ఆ వచ్చి న ఆమెను హాల్‌లో కూర్చుండబెట్టి, మురళి నా దగ్గరికి వచ్చి ‘మీతో రెండు మాటలు మాట్లాడాలి’ అని పక్కకు తీసుకెళ్లాడు. అంతకుముందు వచ్చిన మిత్రుడి భార్యనే ఈమె.. అని తెలియజేశాడు. నాకు పూర్తిగా విషయం అర్థమైంది ఆయన ఏం చెప్పకుండానే. ఏ ఇద్దరు తెలుగు ప్రాంతం నుంచి చెట్టాపట్టాలు వేసుకొని ఆస్ట్రేలియా కు వచ్చారో, ఇక్కడకి వచ్చి విడిపోయినారో, ఆ ఇద్దరే వీరని తెలియగానే నేను దేవునికి మనసులో నమస్కృతులర్పించినాను. ఆమె తన ఇద్దరు పిల్లల్ని కూడా వెంటబెట్టుకొని వచ్చింది. చిలుకలు చెప్పిన మాటలు యథార్థమైనవి. ఐతే ఇప్పుడు నేను చేయవలసిన పని ఆ ఇద్దరిని మళ్లీ ఒకటి చేయడమే. ఆమె పరిచయం అయిన తర్వాత అతణ్ణి కూడా లోపలికి రమ్మన్నాను. దైవవశాత్తూ మీరు నాకు కలిశారు. మీ గురించంతా మురళి చెప్పినాడు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇన్ని మైళ్ల దూరం వచ్చి, మళ్లీ కష్టాలు పడవల్సిందేనా? కలిసి ఉంటేనే కలదు సుఖం అంటూ వారిద్దరినీ కలిపే ప్రయత్నం చేశాను. నాకు తెలిసిన దాంపత్య ధర్మాన్ని తెలియజేశాను.
‘పెళ్లి ఐన పిదప ప్రేమలే ఉండాలి
తప్పులెన్ను కొనగ తావులేదు.
ఓర్పులుండవలయు; ఉత్తుత్తిదానికి
గొడవపడగ రాదు కోర్టుకెక్కి’
కొలను కాడ చిలుకల సందర్శనం, వాటి ద్వారా ఒక ఆలూమగల జంట గురించి తెలియడం, ఆ జంటను తిరిగి కలపడం, తత్ఫలితంగా ‘శుకోపనిషత్తు’ అనే కావ్యం ఆవిర్భవించడం దైవానుగ్రహమనక తప్పదు.
వ్యాసకర్త సెల్‌నంబర్
98856 54381