calender_icon.png 24 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో ఉగ్ర చర్య

24-05-2025 01:58:46 AM

రెండేళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఉధృతమైన ప్రతి సందర్భంలోనూ అమెరికాలో వాటి పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు హత్యకు గురయ్యారు. వాషింగ్టన్‌లోని యూదు మ్యూజియం ఎదుట పక్కా ప్రణాళికతోనే దుండగుడు కాల్పులు జరిపాడు. ‘ఫ్రీ ఫ్రీ పాలస్తీనా’ అంటూ దుండగుడు ఆ సమయంలో నినాదాలు చేశాడని పోలీస్ అధికారులు చెప్పారు.

త్వరలోనే నిశ్చితార్థం చేసుకోవాలనుకున్న ఆ దౌత్యవేత్తల జంట ఉగ్రవాద దాడికి బలైంది. ఈ ఉగ్రవాద చర్యను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఈ ఘటనకు తీవ్ర నిరసన తెలిపాయి. నిజానికి హమాస్, ఇజ్రాయెల్ మధ్య రెండేళ్లుగా సాగుతుతున్న యుద్ధంతో గాజా ప్రజలు విలవిలలాడుతున్నారు. దాడుల కారణంగా 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు 20 లక్షల మంది తిండికి అల్లాడుతున్నారు. గాజాపై విచక్షణారహితంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపాలని పశ్చిమ దేశాలు నెతన్యాహుకు గట్టిగానే చెప్పాయి. అయినా పరిస్థితుల్లో మార్పులేదు. కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ ఒక అడుగు ముందుకు వేసి ఇజ్రాయెల్‌పై ఆంక్షలకు కూడా సిద్ధమయ్యాయి.

వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలపై జరిగిన దాడి, ఇప్పుడు గాజాలోని ప్రజల దయనీయ స్థితి నుంచి ప్రపంచ దేశాలు దృష్టిని మరల్చి యూదు వ్యతిరేకతను ఖండిచడం వైపు తీసుకెళ్తున్నది. ఇజ్రాయెల్‌కు బేషరతుగా మద్దతునిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, వాషింగ్టన్ ఉగ్రదాడిని ఖండిస్తూ యూదు వ్యతిరేకులను తీవ్రంగా హెచ్చరించారు. 

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెల ౨౨న ఉగ్రదాడి తర్వాత అమెరికా ఇంతే తీవ్రంగా స్పందించలేకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది. భారత్‌ను అస్థిరపరిచేందుకు ఐదు దశాబ్దాలుగా పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు, ఎత్తుగడలను పశ్చిమ దేశాలు గమనించడం లేదా? భారత భూభాగంపై పాకిస్థాన్‌ను స్థావరంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థల గురించి పశ్చిమ దేశాలకు తెలియదా? పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు భారత్‌లో ఇప్పటివరకు సాగించిన నరమేధంపై పశ్చిమ దేశాల స్పందన అంతంతమాత్రంగానే వుంది.

2019లో పుల్వామాలో ఉగ్రవాదులు దాడిచేసినపుడు, ‘పాకిస్థాన్ తన గడ్డపై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని టెర్రరిస్టు గ్రూపులకు తక్షణం సహకారాన్ని ఆపాలి’ అని వైట్‌హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత జరిగింది శూన్యం. 2022లో నాటి దేశాధ్యక్షుడు బైడెన్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం, పాకిస్థాన్‌కు ఎఫ్ ఫైటర్ జెట్లను అందించేందుకు 4.50 మిలియన్ అమెరికన్ డాల్లర్ల ఒప్పందం కుదుర్చుకొంది.

అంతేకాదు, ఈ ఒప్పందంలో పాకిస్థాన్, ఉగ్రవాదుల బెడదను అరికట్టగలుగుతుందని కూడా ప్రకటించింది. ఇది ఎంత హాస్యా స్పదమో ఆ తర్వాతే రుజువైంది. ఉగ్రవాదం ఏ దేశంలో తలెత్తినా అది ఉగ్రవాదమేనని, ఇందులో తేడాలేవీ వుండవున్న భారత్ వైఖరిని పశ్చిమ దేశాలు ఇప్పటికీ తల కెక్కించుకున్న దాఖలాలు లేవు. ఉగ్రవాదాన్ని నిర్వచించడంలో ప్రపంచ దేశాలు ఒక్క తాటిపైకి వస్తేగాని ఈ సమస్యకు సర్వత్రా పరిష్కారం లభించదు.