calender_icon.png 26 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లరికల్ గ్రేడ్ పోస్టులకు సింగరేణి అంగీకారం

26-09-2025 12:00:00 AM

  1. గుర్తింపు యూనియన్‌కి, సింగరేణి యాజమాన్యానికి కుదిరిన ఒప్పందం

కారుణ్య నియామకాల్లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో చర్చలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి)ః గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో అభ్యర్థులు పట్టభద్రులైతే.. క్లరికల్ గ్రేడ్ పోస్టులను ఇవ్వడానికి సింగరేని యాజమాన్యం అంగీకరించింది. ఈ అంశంపై గురువారం హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌కు, సింగరేణి యాజమాన్యానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

గతంలో ఈ విద్యార్హత కలిగినవారు జనరల్ అసిస్టెంట్‌గా మాత్రమే పనిచేసే అవకాశం దక్కేది. 2009లో జారీచేసిన సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ డిగ్రీలైన మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, డిప్లమా (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్), ఐటీఐ (ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్) కోర్సులు చేసినవారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కల్పించడానికి అంగీకరించారు.వీరితోపాటు ఇతర డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్ పోస్టుల్లో నియామకం కల్పించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం చేసిన విజ్ఞప్తిని జూన్ 27న జరిగిన డైరెక్టర్ స్థాయి నిర్మాణాత్మక సమావేశంలో చర్చించారు.

సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్ గౌతమ్‌పొట్రు ఆదేశాల మేరకు 2025 సెప్టెంబర్ 5న సింగరేణి సంస్థ, గుర్తింపు కార్మిక సంఘంతో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే యూనియన్ ప్రతినిధులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోసారి చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించడంతో గురువారం తాజా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం.. గని ప్రమాద ఘటనల్లో.. కుటుంబంలోని అర్హులైన వారసులకు టెక్నికల్ డిగ్రీ లేనిపక్షంలో.. ఏదైనా ఇతర డిగ్రీ ఉన్నవారు గ్రేడ్ క్లర్క్ పోస్టుకు అర్హులు. కంపెనీ నిర్వహించే ప్రత్యేక పరీక్షలో వీరు పాసవ్వాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధిస్తేనే గ్రేడ్ క్లర్క్ పోస్టులో నియమిస్తారు. అర్హత సాధించకపోతే.. జనరల్ అసిస్టెంట్ (కేటగిరీ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వభూషణ్, సింగరేణి తరఫున డైరెక్టర్ (పా) గౌతమ్‌పొట్రు, జీఎంలు రఘురామిరెడ్డి, కవితా నాయుడు, వెంకటరామరెడ్డి, వెంకటేశ్వర్లు, రవి బొజ్జా, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు రంగయ్య, వీరభద్రయ్య, సమ్మయ్య, మద్ది ఎల్లయ్య, వై.వి.రావులు పాల్గొన్నారు.