calender_icon.png 23 December, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు ఉత్పత్తిలో దీటైన పోటీలో సింగరేణి

23-12-2025 07:26:27 PM

- మందమర్రి జీఎం రాధాకృష్ణ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచ దేశాలతో దీటైన పోటీతో ముందడుగు వేస్తున్నదని మందమర్రి జీఎం ఎన్ రాధకృష్ణ అన్నారు. మంగళవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమరి ఏరియా జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ  జెండా ను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, అనంతరం కేక్ కట్ చేసి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

ఉద్యోగుల శ్రమతోనే బొగ్గు వెలికి తీసే స్థాయి నుండి ప్రపంచ దేశాలతో  దీటుగా అత్యాధునిక యంత్రాలను ఉపయోగించే స్థాయికి సింగరేణి చేరుకుందన్నారు. దేశాలలోని బహిరంగ గనులలో  అన్ని బొగ్గు గనులకు  దీటుగా సింగరేణి సంస్థ పని చేస్తుందని అన్నారు.  సింగరేణి ఉత్పత్తి మాత్రమే ధ్యేయంగా కాకుండా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి కూడా బాధ్యతగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సంవత్సరం 2025–26, ఏప్రిల్ 2025 నుంచి తేది:17.12.2025 వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పతి లక్ష్యం–48.34 మెట్రిక్ టన్నులు కాగా 41.11 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసి 85% సాధించామని అన్నారు.

బొగ్గు మార్కెట్లో మనం ఈ పోటీ పరిస్థితిని ఎదుర్కొని నిలబడాలంటే మన ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గించుకోవాలని, యంత్రాలను మనం ప్రతి షిఫ్ట్ లో పూర్తి పనిగంటలు వినియోగించి ఉత్పత్తి సాధించాలని ఉద్బోధించారు. ఈ విషయంపై మనం ప్రతి మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాల్లోనూ గనుల మీద చెప్తూనే ఉన్నామని తెలిపారు. పనిగంటలు కొంత మెరుగైనప్పటికీ ప్రతి షిఫ్ట్ లో కార్మికుల పనిగంటలు యంత్రాల పనిగంటలు ఇంకా పెరగాల్సి ఉందని, అప్పుడే మనం ఉత్పత్తి వ్యయం తగ్గించుకో గలుగుతామన్నారు.

మందమరి ఏరియాలో 5976 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు ద్వారా రూ.8 లక్షల కార్పొరేట్ వైద్య బీమా సదుపాయం మన కంపెనీ అందిస్తుందన్నారు. ఉద్యోగులు సొంతగృహ నిర్మాణానికి తీసుకున్న 10 లక్షల రుణం మీద చెల్లించే వడ్డీని కంపెనే చెల్లిస్తోందని ఇప్పటివరకు 570 మందికి ఇంటి రుణం పై వడ్డీ చెల్లించామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మందమర్రి ఏరియాలో 110 మెగావాట్ల సౌర విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. మనం – మన కోసం, మన కంపెనీ కోసం, మన రాష్ట్రం కోసం, పనిచేస్తున్నామనే భావాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తూ సమిష్టిగా కృషి చేస్తూ  కంపెనీకి మంచి పేరు, బంగారు భవిష్యత్తును అందించాలని కోరారు.

సన్మానం..

ఈ సందర్భంగా మందమర్రి ఏరియాలో ఉత్తమ అధికారులు మరియు NCWA ఉద్యోగులకు ఘనంగా సన్మానo చేశారు. అనంతరం సింగరేణి హై స్కూల్ విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ, ఎస్ఓ టు జిఎంజిఎల్ ప్రసాద్, సీఎంఓ ఏఐ మందమర్రి అధ్యక్షులు రమేష్, మందమర్రి ఏరియా డీజీఎం పర్సనల్ అశోక్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శంకర్, జనరల్ మేనేజర్ కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది, అన్ని గనుల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.