23-12-2025 08:57:52 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని 45వ డివిజన్ ప్రజా సమస్యల పరిష్కారానికి యూత్ కాంగ్రెస్ సమిష్టిగా పోరాడుతుందని జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాలిద్ అహ్మద్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌కు విచ్చేసిన ఆయన 45వ డివిజన్‌కు చెందిన కాంటెస్టింగ్ కార్పొరేటర్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ప్రజా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సయ్యద్ ఖాలిద్ అహ్మద్ మాట్లాడుతూ డివిజన్‌లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, త్రాగునీటి ఇబ్బందులు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి ప్రతి అంశంపై ప్రజల తరఫున యూత్ కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
యువతే దేశ భవిష్యత్తు యువత శక్తిని సమాజాభివృద్ధికి వినియోగించాలి ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం అవసరం అజీమ్ లాంటి యువ నాయకులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి యూత్ కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని పేర్కొన్నారు. ప్రతి సమస్యపై అజీమ్ ముందుండాలని, పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. తదుపరి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాజీద్ మాట్లాడుతూ 45వ డివిజన్‌లో ఉన్న ప్రతి సమస్యపై మహమ్మద్ అజీమ్ ముందుండి పోరాడాలని సూచించారు.
ప్రజలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా యూత్ కాంగ్రెస్ అజీమ్‌తో కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర నాయకుల మద్దతుతో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్విష్ టౌన్, ప్రెసిడెంట్ విశాల్, పున్నం మధు, అంజన్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.