05-07-2025 06:59:30 PM
ఏరియా జిఎం దేవేందర్..
మందమర్రి (విజయక్రాంతి): జాతీయ కార్మిక సంఘాలు జులై 9న తలపెట్టిన ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండి యధావిధిగా విధులకు హాజరు కావాలని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్(Singareni Area GM G Devender) కోరారు. జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో జులై 9న ఒకరోజు సమ్మెకు పిలుపునిస్తూ సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరుతున్నారని, సమ్మె డిమాండ్లలో సింగరేణి కార్మికులకు సంబంధించినవి లేవని, సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనవలసిన అవసరం ఉందా ఆలోచించాలని ఆయన సూచించారు.
ఇప్పటికే వివిధ కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపులో వెనుకబడి ఉన్నామని, జులై, ఆగష్టు నెలల్లో వర్షాల ప్రభావం వల్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని, లక్ష్యసాధనకు ప్రతీ రోజు సాధించే బొగ్గు ఉత్పత్తి ఎంతో తోడ్పాటునందిస్తుందన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగడానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. ఒక్క రోజు సమ్మెతో సంస్థకు సుమారు రూ.76 కోట్లు నష్టం వాటిల్లనుండగా, కార్మికులు వేతనాల రూపంలో సుమారు రూ.13.07 కోట్లు కోల్పోతారని అంతే కాకుండా 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లనుందని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సంబంధం లేని అంశాలతో చేపడుతున్న సమ్మెకు కార్మికులు దూరంగా ఉండి, యధావిధిగా విధులు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.