26-04-2025 12:00:00 AM
సిరిసిల్ల చేనేతకు పెట్టింది పేరు. కరీంనగర్ జిల్లాలో దానికున్న ప్రశస్తి చెప్పుకోదగింది. అక్కడ బహుళ సం ఖ్యలో చేనేత కార్మికులు ఉంటారు. వస్త్రోత్పత్తిలో దానిది ప్రత్యేక స్థానం. చేనేత కు టుంబంలో పుట్టిన నాకు సిరిసిల్లా చూడాలనే కోరిక సహజంగానే కలిగింది. ఒకరి ద్దరు తోటి రచయితలతో నాకు “సిరిసిల్లా చూపెట్టండి” అని కోరాను. వారెందుకో నా వినతిని అంగీకరించలేక పోయారు. ‘బంధువులు ఎవరైనా ఉంటే బాగుండు కదా’ అనిపించింది. నిజానికి హైదరాబాద్‌లో కూడా మాకు బంధువులు లేరు. అ దృష్టవశాత్తు పాతపట్నం అమ్మాయి ప్రమీలను పెళ్లి చేసుకోవడం వల్ల క్రమక్రమంగా బంధువులు ఏర్పడ్డారు.
కాని, సిరిసిల్లాకు పోవడం ఎట్లా? రచయితలు సాధారణం గా ఏవైనా పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉంటే దూరప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. కల్వకుర్తి, నల్గొండ, వరంగల్లు మొదలైన ప్రాంతాలకు పుస్తకావిష్కరణలే నన్ను తీసుకెళ్లాయి. సిరిసిల్లాకు వెళ్లే అవకాశం అంత దాకా రాలేదు. అద్భుత చేనేత కళాకారులు ఉన్న ఆ ఊరు చూద్దామన్న నా కల కలగానే మిగిలిపోతుందా? అన్న శంక కూడా కొన్నాళ్లు నన్ను వేధించింది. కానీ, మన కోర్కె లేదా కల నిష్కామమైనప్పుడు భగవంతుడు దానిని తప్పక తీరుస్తాడన్న న మ్మకం నాకు లేకపోలేదు. కాలం అనుకున్నట్టుగానే నా కలను తీర్చింది. మామూ లుగా ఒక్కసారి సందర్శించడం వరకే కాదు, అనేకసార్లు అక్కడికి వెళ్లి అక్కడి వారితో అనుబంధం పెంచుకొనేంతగా నా కల నెరవేరింది. ఆశ్చర్యమే మరి.
ఆ రోజుల్లోనే ఒకనాడు ఉన్నట్టుండి నాకు పోస్టులో ‘ఆటవెలదులు తేటగీతులు’ అనే పుస్తకం (ఇంకా అచ్చుకానిది) వచ్చింది. దూడం నాంపల్లి అనే కవి నా పేరు సూచించి, నాతో ఆ పుస్తకానికి పీఠికను రాయించుకొమ్మని సదరు రచయిత ను కోరినట్లు దానిలో ఒక చిన్న ఉత్తరం కూడా ఉంది. ఆ లేఖను రెండుసార్లు చదువుకున్నాను. ఎందుకంటే, ఆ పుస్తకం పం పిన వారు సిరిసిల్లా వాస్తవ్యులు కాబట్టి.
ఆ పుస్తకం తత్త ప్రధానమైంది. రచయి త కొద్దిగా పేరున్న వారే. జక్కని వెంకట్రాజం. వయసులో నాకంటే పెద్దవారు. వారికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి డా. సి.నారాయణరెడ్డి వంటివారితోనూ స న్నిహిత సంబంధం ఉంది. 1977లో ఆయ న సినారె వారికి ‘అర్ధరాత్రి సూర్యుడు’ అనే కవితా సంపుటిని అంకితం చేశారు. ఇదెంతో బాగుంది. ‘పగలే వెన్నెల..’ పాట రచయితకు ‘అర్ధరాత్రి సూర్యుణ్ణి’ అంకితం చేయడం ఆశ్చర్యంగానూ అనిపించింది నాకు. నేను 1980కి గాని కవిత్వ రచన మొదలు పెట్టలేదు. జక్కని చక్కని కవి అని నాకర్థమైంది. నాకంటే మూడేళ్లు ముందుగానే కవిగా నిలబడినారు.
పుస్తకావిష్కరణ పుణ్యమా అని!
నాకున్న బలం ఆధ్యాత్మికమే. ఏ రచన అయినా తాత్తిక దృష్టితో అనుశీలించడం నాకిష్టం. నేను జక్కని వారి పుస్తకానికి చ క్కని పీఠికను అందించాను. అనుకోకుం డా రెండు మాసాల తర్వాత ‘ఆటవెలదు లు తేటగీతులు’ పుస్తకానికి సిరిసిల్లాలో ఆవిష్కరణ సభ జరుగుతుందని సమాచారం అందింది. నా సిరిసిల్లా సందర్శన కోర్కె నెరవేరే రోజు వచ్చిందనిపించింది. ఆ సభకు గ్రంథస్వీకర్త ఎస్‌ఎస్‌వై (సిద్ధ స మాధి యోగ) వ్యవస్థాపకులు ఋషి ప్రభాకర్‌జీ.
ఆ సభలో ప్రత్యేక అతిథిగా నే ను పాల్గొనాలని ఉత్తరంలో ఉంది. ఎంతో ఆనందించాను. అయితే, అప్పటికి పుస్తక రచయితనుగాని, నన్ను పరిచయం చేసిన దూడం నాంపల్లిని గాని నేను చూడలేదు. సభకు వెళితే వారితోపాటు ఋషి ప్రభాకర్‌జీని కూడా చూడవచ్చు. అంతేకాదు, ఎన్నాళ్లుగానో సిరిసిల్లా చూడాలన్న కోరిక కూడా నెరవేరుతుందని అనుకున్నాను.
అది 2011. కారులో నా మిత్రుడు డా.తిరునగరితో వెళ్లాను. సభలో ప్రవేశించగానే మాకు మంచి స్వాగతం లభించిం ది. సభా వేదిక మీద స్ఫురద్రూపి, శ్వేత వస్త్రధారి ప్రభాకర్‌జీ ఆసీనులై ఉన్నారు. వారి పక్కన ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ కూర్చున్నారు. సభ మూడు గంటలు సాగింది. ఋషి ప్రభాకర్ రావడం వల్ల పట్నమంతా కదిలి వచ్చింది.
నాకు మొదటిసారి సిరిసిల్లాలో అడుగుపెట్టే అదృష్టంతోపాటు సభా గౌరవం కూ డా దక్కింది. సిరిసిల్లా చూడాలన్న కోరిక అంతటితో తీరింది. కాని, ఆ సభ తర్వాత జక్కన వారు నన్ను విడిచి పెడితేనా? సభలో నా ప్రసంగం తనని ఆకట్టుకుందని చెప్పారు. తాను ఆధ్యాత్మిక రచనలంటే ఇష్టపడతానని, 30 ఏళ్లుగా ఏ రచనా చే యకుండా ఉన్నానని, ప్రభాకర్‌జీ శఙష్యుడిని అయినందునే పై పుస్తక రచన చేశా న ని తెలిపారు. క్రమక్రమంగా జక్కన వెంకట్రాజంతో పరిచయం పెరిగింది. 2015లో కోరుట్లలో ఎం.వి. నరసింహారెడ్డి కళాశాల లో జరిగిన కార్యక్రమానికి నేను, భార్యా సమేతంగా వెళ్లాను. జక్కని వారుకూడా ఆ సభకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మాతోపాటు సిద్దిపేట దాకా వచ్చారు.
“ఎందుకింత కష్టపడి నాతో వచ్చారు?” అన్నాను ఉండబట్టలేక.
“మీ దంపతులతో కలిసి ప్రయాణించాలని అనిపించింది, అంతే..” అన్నారాయన.
ఆ మాటలకు నా శ్రీమతి ప్రమీల కూడా ఎంతో సంతోషపడింది. జక్కని సిద్దిపేటలో దిగి సిరిసిల్లాకు వెళ్లిపోయారు. మేం ఇంటికి వచ్చాం.
ఆధ్యాత్మికతతోనే ఊరట
జక్కని వారితో అనుబంధం అంతటితో ముగియ లేదు. వారానికి ఒక సారైనా మాట్లాడకుండా ఉండేవారు కారు. అకస్మాత్తుగా వారి గురువు పరమపదించారు. దాంతో ఆయన ఏకాకి అయినట్లు భావించారు. కొన్ని రోజులకు నేనుకూడా నా భార్యా వియోగాన్ని పొందాను. ఈ విష యం తెలిసి జక్కని వారెంతో బాధ పడ్డా రు. ‘మాతో కలిసి కారులో సిద్దిపేటకు వచ్చిన విషయాన్ని’ పలుమార్లు ప్రస్తావించారు. గురువును కోల్పోయి జక్కని వారు, భార్యను కోల్పోయి నేను.. విషాదంలో మునిగిపోయాం. విధి బలీయమైంది కదా! జక్కని వారొక రోజు ఫోను చేశారు.
“మీరు సిరిసిల్లాకు రావాలి. ఒక వారం మా ఇంట్లోనే ఉండాలి” అన్నారు ఎంతో ఆత్మీయంగా.
విషాదంలో ఉన్న నేను బస్సులో సిరిసిల్లాకు వెళ్లాను. వారింట్లో వారం రోజులు ఉన్నాను. ఆయన ఆదరణకు నోచుకోవ డం అదృష్టమే అనిపించింది. ఇంటిల్లిపాది నాపట్ల చూపిన గౌరవానికి పులకించి పోయాను. మేమిద్దరమూ విషాదంలోనే ఉన్నాం. కాని, దానినుంచి బయట పడటానికి ఉన్న మాకున్న ఏకైక మార్గం ఆధ్యాత్మికత.
అప్పటికీ రెండు, మూడు ఉపనిషత్తులను ‘ముత్యాల సరాల’లోకి అనువదించి న నేను ఉపనిషత్తుల పరమార్థాన్ని, లక్ష్యా న్ని ఆయనకు వివరించాను. ఇంకేం, జక్కని వారు వరుసగా ఏడు ఉపనిషత్తులను ‘ముత్యాల సరాల’లో అనువదించి, నాకు మంచి అనుయాయిగా నిలిచారు. కఠోపనిషత్తును తెనిగించి నాకే అంకితం చేశారు. తెలుగులో ఎక్కువ ఉపనిషత్తులను ‘ముత్యాల సరాల’లో అందించిన గౌరవం వారికే దక్కింది. ఉపనిషత్తుల అనువాదం సాగినన్ని రోజులు మా వార్తా కలాపం కొనసాగడమేగాక సిరిసిల్లాకు నాలుగైదు మాసాలకు ఒకసారి వెళ్లి, వారింట్లోనే ఉం డి ఆతిథ్యాన్ని స్వీకరించే అవకాశం లభించింది. కాలమహిమ అంటే ఇదే కదా. జీవితంలో ఒక్కసారి సిరిసిల్లా చూడాలనుకున్న నేను ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్లానో నాకే తెలియదు. భగవత్కృప ఉంటే సాధ్యం కానిది ఏముంది? కాకపోతే, మన లక్ష్యంలో నిజాయితీ ఉండాలి. అంతే.
వ్యాసకర్త: ఆచార్య మసన చెన్నప్ప సెల్ : 9885654381