calender_icon.png 6 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఫలాలు అందరికీ అందాలి!

26-04-2025 12:00:00 AM

భారతదేశం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు ఇకనైనా ప్రజల వాస్తవ పరిస్థితిని గమనించా లి. ఈ ఆర్థికాభివృద్ధి వాపా లేక బలుపా అని బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వివిధ అంశాలపై ప్రకటించిన అనేక ర్యాంకులు పరిశీలిస్తే, మన దేశ వాస్తవ అభివృద్ధి కళ్ళకు కడుతున్నది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మన దేశం 109వ స్థానంలో నిలిచింది.

మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో 134వ స్థానం, సంతోష సూచికలో 126వ స్థానంలో, ఆకలి సూచిలో 105వ స్థానంలో, అవినీతిలో 96వ స్థానంలో, పో షకాహార లోపంలో 111వ స్థానంలో, మహిళా రక్షణలో 128వ స్థా నంలో, మల్టీ డైమెన్షనల్ పోవర్టీలో 126వ స్థానంలో, లింగ సమానత్వంలో 129వ స్థానంలో, తలసరి ఆదాయంలో 124వ స్థానం లో, అక్షరాస్యత రేటు 80 శాతం లోపు, నిరుద్యోగం దాదాపు 5 శాతంతో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇటువంటి పరిస్థితు ల్లో ఐదవ ఆర్థిక వ్యవస్థగా మారటం వల్ల భారతదేశానికి ముఖ్యం గా పేద, మధ్యతరగతి ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటి!? నేటికీ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయి. అనేక విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేక విలవిలలాడుతున్నాయి. దాదాపు ప్రపంచంలోనే ప్రాముఖ్యత కలిగిన వంద విశ్వవిద్యాలయాల్లో మన దేశం నుంచి ఒక్కటైనా లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ, పేద ప్రజలపై భారం పడుతున్నది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మండుతున్నాయి. ఎక్కడ చూసినా నిరుద్యోగం తాండవిస్తున్నది.

ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలసల భారతంగా ఉంది. అన్నదాతల ఆర్తనాదాలు పాలకులకు వినబడడం లేదు. కేవలం నాలు గు రహదారులు, ఆరు విమానాశ్రయాలు, పది బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యాలు నిర్మించి, యాభై, డెభై అడుగుల విగ్రహాలు, సందర్శించే దేవాలయాలు, ఆకర్షించే కుంభమేళాలు వంటివి చేయడం ద్వారా దేశంలో పేదరికం తగ్గుతుందా!? పాలకులారా ఆలోచించండి. చైనా వలే స్వయంసమృద్ధి సాధించేందుకు కృషి చేయాలి. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాని, కొందరు బడా పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్ వ్యక్తులు, బిలియనీర్ల సంప దే అభివృద్ధి అని నమ్మి, దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారిందని చెబితే మురిసి పోవడం చాలా ప్రమాదకరమని గ్రహిద్దాం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ‘దేశ ప్రజల అందరి అభివృద్ధే, దేశాభివృద్ధి’ అని నమ్మి ముందుకు సాగుదాం.

 -ఐ.ప్రసాదరావు