10-08-2025 01:29:15 AM
చిన్న నాగారంలో మాజీ ఎంపీటీసీ విగ్రహానికి..
మహబూబాబాద్, ఆగస్టు 9 (విజయ కాంత్): తమ సోదరులు మృతిచెందడంతో వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, ఆ విగ్రహాలకు రాఖీలు కట్టి పండుగను జరుపుకున్నారు సోదరిమణులు. మహబూబా బాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం మాజీ ఎంపీటీసీ భూక్యా లక్ష్మణ్ రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన అతడి విగ్రహానికి అతడి చెల్లి బానోత్ లింగమ్మ రెండేళ్లుగా రాఖీ కడుతున్నది. శనివారం కూడా విగ్రహం చేతికి రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది.
సైనికుడి విగ్రహానికి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాకు చెందిన భారత మాజీ సైనికుడు గుగులోత్ నరసింహ 2014లో ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి అమరుడయ్యాడు. ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
తమ్ముడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడానికి ఆ కుటుంబం తమ ఇంటివద్ద నరసింహ విగ్రహాన్ని నిర్మించింది. గత పదేండ్లుగా ప్రతి రాఖీ పండుగ రోజున నరసింహ అక్కలు రాజమ్మ, బూలమ్మ, శ్రీలత ఆ విగ్రహం వద్దకు వచ్చి రాఖీ కడతారు. ఈ ఏడాది కూడా వారు విగ్రహాన్ని కడిగి, బొట్టు పెట్టి, రాఖీ కట్టి తమ తమ్ముడిపై ప్రేమను చాటుకున్నారు.
రాఖీ కట్టి హెల్మెట్ బహుకరించిన అక్క
నంగునూరు: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామానికి చెందిన రేణుక తన తమ్ముడు బెదురు తిరుపతికి రాఖీ కట్టి హెల్మెట్ బహుమతిగా ఇచ్చింది. సోదర అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగకు అక్కలు, చెల్లెలు ఆశీర్వదిస్తారు.
కానీ రేణుక తన తమ్ముడికి కేవలం ఆశీస్సులు, ప్రేమ మాత్రమే కాకుండా అతని భద్రతపై తనకున్న శ్రద్ధను చాటుకుంటూ ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చింది.
చివరి రాఖి కట్టుకో తమ్ముడా!
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో గ్రామానికి చెందిన సుంకరబోయిన యాకయ్య అనారోగ్యంతో శనివారం కన్నుమూశాడు. రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టేందుకు వచ్చిన సోదరీమణులు పూలమ్మ, జయమ్మ, దేవా, నాగమ్మ, నీలమ్మ తమ్ముడు చనిపోయినప్పటికీ, ఇక ఆఖరి రాఖీ కట్టుకో అంటూ రోదనలతో తమ్ముడి చేతికి రాఖీ కట్టిన దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.