08-01-2026 12:54:25 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా.. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన తమ్ముడు కొండల్‌రెడ్డి ఫోన్‌ను నిఘా విభాగం అధికారులు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో బాధితుడిగా ఆయన నుంచి వివరాలు సేకరించి, వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అధికారులు పిలిపించినట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
ఇదే కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ లోతుగా ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌కు చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. వీరిని కూడా గురువారం ఉదయం 11 గంటలకే విచారణకు రావాలని సూచించింది. మునుగోడు ఉప ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ మాజీ అధికారులతో, నిందితులతో వీరు జరిపిన ఫోన్ సంభాషణలపై సిట్ అధికారుల వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంభాషణల వెనుక ఉన్న ఉద్దేశం, రాజకీయ లబ్ధి తదితర అంశాలపై వారిని ప్రశ్నించే అవకాశం ఉంది.
డుమ్మా కొట్టిన కొండలరావు, సందీప్‌రావు
ఇదిలా ఉండగా, ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావుకు కూడా సిట్ ఇదివరకే నోటీసులు ఇచ్చింది. బుధవారం మధ్యా హ్నం ఒంటిగంటకు విచారణకు రావాలని సూచించగా, వారు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాల వల్ల సిట్ కార్యాలయానికి రాలేకపోతున్నానని, తన నివాసంలోనే విచారణకు సిద్ధమని కొండలరావు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీరి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది.