12-09-2025 06:13:09 PM
వలిగొండ,(విజయక్రాంతి): సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి గొప్ప మార్క్సిస్టు మహా మేధావని ఆయన మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. శుక్రవారం సిపిఎం వలిగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి గర్దాసు నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ సీతారాం ఏచూరి గొప్ప మార్క్సిస్టు మహా మేధావని ఆయన మరణం సిపిఎం ఉద్యమానికే కాకుండా దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేసిన గొప్ప నాయకుడని, యూపీఏ మొదటి ప్రభుత్వంలో అనేక చట్టాలను సాధించడంలో వాటిని రూపకల్పన చేయడంలో క్రియాశీలకంగా పనిచేసిన మేధావన్నారు.
ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం లాంటి చట్టాలను ప్రజలకు అందించాలని దృఢ సంకల్పంతో పనిచేసిన నాయకుడన్నారు. రాజ్యసభ సభ్యులుగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడి కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని మెడలు వంచడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకున్ని కోల్పోవడం ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటని ఆయన ఆశయ మార్గంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అప్పుడే ఆయన ఆశయాలను సాధించిన వారమవుతామని అన్నారు.