మాయావతి x అఖిలేశ్ యాదవ్

10-05-2024 01:16:14 AM

ఎస్పీ, బీఎస్పీ మధ్యసోషల్ వార్

బీఎస్పీపై అఖిలేశ్ విమర్శల పర్వం

అఖిలేశ్‌కు మాయావతి కౌంటర్

బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాదన్న అఖిలేశ్

ముందు మీ పార్టీ సంగతి చూసుకోండని మాయావతి హితవు

న్యూఢిల్లీ, మే 9: సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇక ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ నాయకులు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఇక్కడ ఇండియా కూటమి, బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తుంటే.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత మాయావతి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల బీఎస్పీ కోఆర్డినేటర్ పదవి నుంచి మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తప్పించారు. ఏడాది కిందటే ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తొలగించారు. దీనిపై అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో మాయావతి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. యూపీలో ఏడు దశల్లో 80 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మూడు విడతల్లో 26 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక 54 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్పీని ఎస్పీ టార్గెట్ చేయడం మరింత ఆసక్తిగా మారింది. ఎస్పీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండగా, బీఎస్పీ మాత్రం ఒంటరిగానే బరిలో దిగింది. అయితే ఎస్పీ, బీఎస్పీ మధ్య కొట్లాట ఎవరికి మంచి చేస్తుంది.. ఎవరికి చేటు తెస్తుందనేది వేచి చూడాల్సిందే. 

అఖిలేశ్ ఏమన్నారు..?

ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ తొలగించడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, అయితే బీఎస్పీకి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదనేందుకు ఈ మార్పే నిదర్శనమని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం బీఎస్పీకి చెందిన చాలా మంది సంప్రదాయవాదులు ఎస్పీకి ఓటేస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని బీఎస్పీ వైఫల్యంగా భావిస్తోందని, అందుకే అగ్రనాయకత్వం భారీ మార్పులు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం బీఎస్పీ చేతిలో ఏమీ లేదని, బీఎస్పీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మూడు విడతల ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. మిగిలిన నాలుగు దశల్లోనూ బీఎస్పీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్పీకి ఓటేసి వృథా చేసుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. 

ఎస్పీకి మాయావతి కౌంటర్

ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి కౌంటర్ ఇచ్చారు. ఎస్పీ ఎప్పుడూ దళితులకు వ్యతిరేకమని దుయ్యబట్టారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు రద్దు చేయడం, పార్లమెంటులో బిల్లలు చించేసిన చరిత్ర ఎస్పీద ని మండిపడ్డారు. తమపై సానుభూతి చూపే బదులు, ఎస్పీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందం టూ హితవు పలికారు. కాగా, దళితులు ఎక్కువగా బీఎస్పీకి మద్దతు ఇస్తుంటారు. అయితే అఖిలేశ్ చెప్పినట్టు బీఎస్పీ ఓటు బ్యాంకు ఎస్పీకి మళ్లితే ఇండియా కూటమి లాభ పడనుంది. అలా కాని పక్షంలో బీజేపీ వైపు మళ్లితే బీజేపీకి లాభం చేకూరుతుంది. యూపీ లో అధిక సంఖ్యలో ఉన్న దళిత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నా లు చేస్తున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో.. బీఎస్పీ.. ఎస్పీ మధ్య విబేధాలు ఎవరికి లాభం చేకూరుస్తుందనే విషయం వేచి చూడాలి.