03-02-2025 07:47:27 PM
మహాదేవునిపేట,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడుకే తల్లిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన జిల్లాలోని బిజినపల్లి మండలం మహాదేవునిపేట గ్రామంలో జరిగింది. మూడు రోజు క్రితమే జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొడుకు కరుణాకర్(24) అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగుతున్నాడని తల్లి యాదమ్మ(45) మందలించింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న కుమారుడు, తల్లిని అతికిరాతకంగా నరికి చంపాడు.
తల్లిని చంపి ఏమీ జరగనట్లుగా గ్రామంలో తిరిగాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తప్పులను బద్దలుకొట్టి చూడగా యాదమ్మ విగత జీవిగా పడి ఉంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు యాదమ్మ మూడు రోజుల క్రితమే మరణించినట్టుగా గుర్తించారు. కుమారుడు కరుణాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.