02-10-2025 01:54:46 AM
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను కోర్టులో ఫిటిషన్ వేసి అడ్డుకోవడం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు కోరారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బయట ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో బీసీ నాయకులందరూ బయటికి రావాలని పిలుపునిచ్చారు.
గతంలో ఇచ్చిన 27 శాతం రిజర్వేషన్‌లే అమలు కావడం లేదని, ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు బయటికి రాకపోతే భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మళ్లీ రాదని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీసీలకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని, ఈ అవకాశాన్ని బీసీలు సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ మంత్రులతో కలిసి తాము ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నామని చెప్పారు.
స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలని, అందుకు బీసీలు హక్కుల సాధన కోసం అంతా ఒక్కటి కావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జన గణన చేసి బీసీలకు న్యాయం చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, కామారెడ్డి డిక్లరేషన్ సభలో 42 శాతం ఇస్తామన్న హామీని సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారని తెలిపారు. రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా 4,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు, బలహీన వర్గాల సమస్యలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ నేతలు లక్ష్మణ్‌యాదవ్, మెట్టు సాయికుమార్, నారాయణస్వామి, అల్లం భాస్కర్ పాల్గొన్నారు.